వచ్చేనెల 15నాటికి కొత్త మిర్చి యార్డు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ ఆధునికీకరణలో భాగంగా మొదటి దశ పనులు ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. మార్కెట్‌లో పనులను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. వచ్చే సీజన్‌కల్లా అవసరమైన అదనపు షెడ్లు, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలని తెలిపారు. రైతులు యార్డ్‌లోకి రాగానే మంచి అనుభూతి కలిగేలా అంతర్జాతీయ స్థాయిలో వసతులు ఉండాలని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ప్రదర్శించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు అమర్చాలని సూచించారు. అంతేకాక ప్రవేశ ద్వారా వద్దే ఏ షెడ్డుకు తీసుకెళ్లాలి, వేలానికి ఎంత సమయం పడుతుందనే విషయమై రైతులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటు, రైతులు బస చేసేలా వసతులు, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్, వే బ్రిడ్జిలు సిద్ధం చేయాలని సూచించారు.
రెండు దశల్లో పనులు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మంలో మిర్చి యార్డు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.155.30 కోట్లు కేటాయించగా రెండు దశల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో రూ.114.96 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని ఇప్పటికే ఏడు షెడ్లకు గాను ఐదింటి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగతా పనులు త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, వైస్‌చైర్మన్లు హన్మంతరావు, తల్లాడ రమేష్, జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, గంగాధర్, అలీమ్, మధుసూదన్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల
కార్యదర్శి సురేంద్ర మోహన్


