దివ్యాంగుల అభ్యున్నతికి కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించగా కలెక్టర్ కేక్ కట్ చేసి మాట్లాడారు. గ్రామపంచాయ తీ ఎన్నికల కోడ్ కారణంగా నెల ఆలస్యంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉందని, త్వరలోనే దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నిధులు అందిస్తామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు పారదర్శకంగా సదరమ్ సర్టిఫికెట్ల జారీ, కంటిచూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం కేటాయించనున్నట్లు చెప్పారు. బ్యాక్‌లాగ్ పోస్టులు నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విజేత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, డీహెచ్‌ఈడబ్ల్యూ సమ్రీన్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫిర్యాదులన్నీ పరిష్కరిస్తాం..
● సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి
సత్తుపల్లిరూరల్: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తూ మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విద్యుత్ విని యోగదారుల సదస్సులో పలువురు ఫిర్యాదులు అందజేశారు. వేంసూరు, సత్తుపల్లి మండలాల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించాక చైర్మన్ మాట్లాడారు. ఉద్యోగులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చని తెలిపారు. సదస్సులో డీఈఈ రాములు, ఏడీఈ ప్రసాద్‌బాబు, ఏఈఈలు శరత్‌బాబు, హనుమంతురావు, అనిల్, అంకారావు పాల్గొన్నారు.
20న చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’
ఖమ్మంగాంధీచౌక్: ప్రకృతి వ్యవసాయం, ఆరో గ్యంపై అవగాహన కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల్లో త్రిదండి చినజీయర్ స్వామి ‘సఫలా యాత్ర’ నిర్వహించనున్నారని జీయర్ సంస్థల సలహాదారు ఎర్నేని రామారావు తెలిపారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ యాత్రలో భాగంగా ఈనెల 19న జీయర్ స్వామి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారని వెల్లడించారు. భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో 20వ తేదీన ప్రకృతి వ్యవసాయంపై జరిగే సదస్సులో మాట్లాడాక రైతులతో కలిసి యాత్ర నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే, 21న ఖమ్మంలోని ఈఆర్‌ఆర్ రిసార్ట్స్‌లో జరిగే శ్రీగోదారంగనాథస్వామి కల్యాణ వేడుకలో పాల్గొంటారని తెలిపారు.
దివ్యాంగుల అభ్యున్నతికి కార్యాచరణ


