ఇంకొన్ని రోజులు ఆగాలి..
● ఎస్సెస్సీ విద్యార్థుల అల్పాహారానికి నిధులు ● వచ్చేనెల 16వ తేదీ నుంచి 19 రోజుల పాటే అమలుకు నిర్ణయం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా వివిధ కార్యక్రమాలు అమలుచేస్తూనే పదో తరగతి ఫలితాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యాన ఎస్సెస్సీ విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులకు హాజరై ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులు ఆకలితో బాధపడకుండా అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ప్రత్యేక తరగతులు మొదలైనా వచ్చేనెల 16నుంచి అల్పాహారం అందించాలన్న నిర్ణయంపై విద్యార్థుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ఉదయం, సాయంత్రం తరగతులు
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి కావొస్తుండగా రివిజన్ చేయించడంతో పాటు స్లిప్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉదయం 7–45నుంచి 8–45గంటల వరకు, సాయంత్రం 4–15నుంచి 5–15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో విద్యార్థులను చదివించడమే కాక వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అయితే, ఉదయం 7–45గంటలకు పాఠశాలకు వచ్చే విద్యార్థులు సాయంత్రం 5–30గంటల వరకు ఉండాల్సి రావడం, ఆతర్వాత గ్రామీణ విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సరికి ఆలస్యమై ఆకలితో బాధపడుతున్నారు. ఈనేపథ్యాన కొన్ని పాఠశాలల్లో దాతల సాయంతో అల్పాహారం సమకూరుస్తుండగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో అమలుకు నిర్ణయించింది. జిల్లాల్లో అన్ని యాజమాన్యాలు కలిపి 195 పాఠశాలల్లో 5,508మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.15చొప్పున రూ.82,620 కేటాయించగా, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు అమలు కోసం 19రోజులకు రూ.15,69,780 నిధులు కేటాయించారు. ఈ నిధులు త్వరలో డీఈఓ ఖాతాలో జమ కానుండగా హెచ్‌ఎంల ఖాతాలకు బదలాయిస్తారు.
ముందు ప్రారంభిస్తేనే...
ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నుంచే ఉదయం, సాయంత్రం ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఇళ్లకు చేరే సరికి ఆలస్యమవుతోంది. ఈనేపథ్యాన ప్రభుత్వం ఫిబ్రవరి 19నుంచి అల్పాహారం అందించనున్నట్లు ప్రకటించింది. అలా కాకుండా ఇప్పటినుంచే అల్పాహారం అమలుకు నిర్ణయిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరుతున్నారు.


