బాలికలకు భరోసా
త్వరలోనే అందుబాటులోకి
హెచ్‌పీవీ వ్యాక్సిన్
జిల్లాలో ఇప్పటికే బాలికల
గుర్తింపు పూర్తి
సిబ్బంది శిక్షణ పూర్తి
గర్భాశయ ముఖద్వార కేన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ కేన్సర్ ఉన్నట్లు గుర్తించేలోగా తీవ్రత పెరుగుతుండడంతో అత్యాధునిక చికిత్స చేయించినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. ఈనేపథ్యాన బాలికల దశలోనే కేన్సర్ సోకే అవకాశాలను తుంచివేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. బాలికలు కేన్సర్ బారిన పడకుండా కట్టడి చేసేందుకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సిన్ సిద్ధం చేశారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండగా 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు లోపు ఉన్న బాలికల గుర్తింపు ఇప్పటికే పూర్తిచేశారు. – ఖమ్మం వైద్యవిభాగం
మహిళలే బాధితులు
కేన్సర్ బాధితుల్లో పురుషుల కన్నా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. గర్భాశయం, రొమ్ము కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో 14–15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలకు ఉచితంగా టీకా వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ వయస్సులోనే బాలికలకు హార్మోన్ల మార్పులు జరిగే అవకాశమున్నందున ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్బాశయ ముఖ ద్వారా కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని గుర్తించారు. ఈనేపథ్యాన ప్రభుత్వమే ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) టీకాలు వేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుండడంతో జిల్లాలో 14–15 ఏళ్ల బాలికల గుర్తింపు పూర్తి చేశారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వారీగా సర్వే నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో మొత్తం 19,500 మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు.
కేన్సర్‌పై పెరుగుతున్న అవగాహన
జిల్లాలో గతంతో పోలిస్తే కేన్సర్‌పై అవగాహన పెరుగుతోంది. ముప్ఫై ఏళ్లు నిండిన మహిళలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం అందుబాటులోకి వచ్చాక పరిస్ధితి మారింది. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగం ఉండడంతో మహిళలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలుకాగా జిల్లాలోని 12 పీహెచ్‌సీల పరిధిలో కొనసాగుతోంది. పీహెచ్‌సీల్లో సర్వైకల్, బ్రెస్ట్, ఛాతి, నోటి, థైరాయిడ్ తదితర కేన్సర్లకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానితులుగా ఎవరైనా తేలితే జిల్లా ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 6,645 మంది మహిళలకు పెద్దాస్పత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా పూర్తిపరీక్షలు నిర్వహించగా 232 మందికి కేన్సర్ ఉన్నట్లు తేలింది. వీరిలో 92 మందికి బ్రెస్ట్ కేన్సర్, 72 మందికి సర్వైకల్ కేన్సర్, 22 మందికి థైరాయిడ్ కేన్సర్ ఉండగా చికిత్స నిమిత్తం ఎన్‌ఎంజేకు రిఫర్ చేశారు. అయితే యుక్త వయస్సు బాలికల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ సోకే అవకాశం ఉండడంతో తొలిదశలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా బాలికల వయస్సు పెరిగాక కేన్సర్ బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
సర్వైకల్ కేన్సర్ బారిన
పడకుండా టీకా
హెచ్‌పీవీ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ వేసేలా మా శాఖ ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాము. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలందరికీ టీకా వేయనున్నాం. ఈ వయస్సు వారు జిల్లాలో 19,500 మంది ఉండగా.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం.
– చందూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
బాలికలకు భరోసా


