అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దాం..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు
అభివృద్ధిని చూసి ఓటు వేయాలి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర: కాంగ్రెస్ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే మరో పార్టీకి భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోవడంలో కాంగ్రెస్ శ్రేణులు వెనుకబడగా.. మిగతా పార్టీలు కొద్దిపాటి పనులనే ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. ఇకనైనా అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు చేయాలని సూచించారు. మధిర పట్టణం అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవితం సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ పథకాలు మధిరలో అర్హులకు కూడా అందుతుండగా, అభిృవృద్ధి పనులకు రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నా. ఈ విషయాన్ని ప్రతీ నాయకుడు రోజుకు కనీసం పది మందికి వివరించాలని.. తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మధిరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు డిగ్రీ, ఇంటర్, హైస్కూళ్లకు సొంత భవనాలు, పాలిటెక్నిక్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. కాగా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తయ్యాక మధిర పట్టణమంతా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని భట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.


