రిజర్వేషన్‌.. టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్‌.. టెన్షన్‌

Jan 9 2026 7:16 AM | Updated on Jan 9 2026 7:16 AM

రిజర్వేషన్‌.. టెన్షన్‌

రిజర్వేషన్‌.. టెన్షన్‌

గత రిజర్వేషన్ల ఆధారంగా అంచనాల్లో పార్టీలు చైర్మన్‌, వార్డు పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ

వేచి చూడాల్సిందే..

గత ఎన్నికల్లో మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు..

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆతర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతుంది. దీంతో ఆశావహులు చైర్మన్‌ పదవితోపాటు వార్డుల రిజర్వేషన్‌ ఎలా ఉంటుందనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా ఏ వార్డు ఎవరికి రిజర్వ్‌ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా చైర్మన్‌ గిరిపై కన్నేసిన నేతల్లో టెన్షన్‌ నెలకొనగా.. అంతా అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

చకచకా పనులు

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తి చేశారు. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై కూడా పురపాలక శాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్లు ఖరారైతేనే ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో త్వరగా పూర్తిచేసేలా అధికారులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.

జనాభా ఆధారంగా..

మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వార్డుల రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వాటా ప్రకారం స్థానాలు కేటాయిస్తారు. ఇక బీసీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్‌ కమిషన్‌ సిఫారసుల ఆధారంగా లెక్కిస్తారు. ఆపై జనరల్‌ స్థానాలను కూడా గుర్తించాక.. అన్ని కేటగిరీ ల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు.

ఎలా ముందుకు వెళ్లాలి?

మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలోని పాత మున్సిపాలిటీలైన సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి.. ఏ మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్‌ అవుతుందో అంచనా వేస్తున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌కు, వైస్‌ చైర్మన్‌ బీసీ మహిళకు కేటాయించారు. అలాగే వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి ఎస్సీకి, వైస్‌ చైర్మన్‌ బీసీకి దక్కింది. ఇక మధిర చైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు, వైస్‌చైర్మన్‌ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఈసారి ఇందులో ఎలాంటి మార్పులు జరుగుతాయో... ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహులైన నేతల్లో ఉంది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో వేగం

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు వేచి చూడక తప్పదు. కొందరు వార్డుల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఓ స్థాయి నేతలు మాత్రం చైర్మన్‌ పదవిపైనే గురి పెట్టారు. మరికొందరు కౌన్సిలర్‌గా పోటీ చేయడంతో పాటు చైర్మన్‌ పదవిని దక్కించుకునేలా ఇప్పటి నుంచే నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే, వార్డుల నుంచి పోటీకి సిద్ధమైన కొందరు రిజర్వేషన్‌ అనుకూలించకపోతే మరో వార్డు నుంచి పోటీ చేసి గెలవొచ్చా అని కూడా పరిశీలిస్తున్నారు. అవకాశం ఉంటుందని భావిస్తున్న వారు ప్రయత్నాలు చేస్తూనే, తాము పోటీ చేయాలనుకునే మున్సిపాలిటీ ఎవరికి రిజర్వ్‌ అవుతుందో అనుచరులతో చర్చిస్తున్నారు. వార్డుల వారీగా జనాభా ఎవరు ఎక్కువగా ఉన్నారో ఆరా తీస్తూ అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల రిజర్వేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

మున్సిపాలిటీ జనరల్‌ బీసీజనరల్‌ ఎస్సీ జనరల్‌ ఎస్టీ జనరల్‌

/మహిళ /మహిళ /మహిళ /మహిళ

సత్తుపల్లి 05/7 4/3 02/1 1

వైరా 3/5 4/3 2/2 1

మధిర 5/5 2/3 1/5 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement