సీఎంను కలిసిన మేయర్, కార్పొరేటర్లు
● నగర అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని వినతి ● కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర అభివృద్ధికి రూ.250 కోట్ల నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు సీఎంను హైదరాబాద్‌లో కలిసి నిధుల మంజూరు కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, ఎల్‌ఆర్‌ఎస్ నిధులు రూ.57 కోట్లు వినియోగించుకునేందుకు పరిపాలన అనుమతి ఇప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక వసతులు, అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ద్యం మెరుగు పరిచేందుకు మరిన్ని నిధులు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మేయర్ నీరజ వెల్లడించారు.
కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు
బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షాన కార్పొరేటర్లు తోట ఉమారాణి, దనాల రాధ, రుద్రగాని శ్రీదేవికి కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇటీవలే ఐదుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరగా వీరితో కలిపి ఎనిమిదికి చేరింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, నాయకులు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.


