జిల్లాలో 10,345 మె.టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుతం 10,345 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు 83 పీఏసీఎస్‌ల్లో 1,169.10 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ షాపుల్లో 525.70 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. యాసంగి సాగుకు అవసరమైన యూరియా అన్ని మండలాల్లో పంపిణీ చేస్తుండగా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే రైతులు ఏఓలు, ఏఓఈల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.
సీతారామ భూసేకరణ పూర్తి చేయాలి
ఖమ్మం అర్బన్: సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిస్టిబ్య్రూటరీ కాల్వలకు భూసేకరణను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. సీతారామ ప్యాకేజీ–2 పరిధి కాల్వ ద్వారా కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 12,454 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ఈమేరకు పెనుబల్లి మండలంలో భూసేకరణను ఫిబ్రవరి 3నాటికి పూర్తిచేయాలని ఆదేశించగా, కల్లూరు మండలంలో పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, సర్వేయర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
30 శాతం రక్తం
ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు..
ఖమ్మంవైద్యవిబాగం: ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌ల నిర్వాహకులు సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ రామారావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్లడ్ బ్యాంక్‌ల నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యాన రక్తదాన శిబిరాలు నిర్వహించినప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వడమే కాక సేకరించిన రక్తంలో 30శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు అందించాలని తెలిపారు. అలాగే, శిబిరాల సమయాన హెచ్‌ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ బీ పాజిటివ్ కేసులను గుర్తిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ సెంటర్లకు రిఫర్ చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బి.చందునాయక్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వల వివరాలు ప్రదర్శించడమే కాక స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, స్వప్నమాధురి, నాగయ్య, మెహమూద్ అలీ, వీరయ్య పాల్గొన్నారు.
జిల్లాలో 10,345 మె.టన్నుల యూరియా


