పుర పోరుకు అడుగులు..
న్యూస్‌రీల్
10న ఓటరు తుది జాబితా
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముగిసిన సమావేశాలు
ఈనెల 10 తుది జాబితా ప్రచురణకు ఏర్పాట్లు
ఈనెలలోనే ఎన్నికల షెడ్యూల్
వస్తుందన్న ప్రచారంతో పార్టీల్లో సందడి
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
తొలి అంకం పూర్తయినట్టే...
జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగియగా.. కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు నూతనంగా ఎర్పడ్డాయి. వీటిలో ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా 117 వార్డుల్లో 1,42,901 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలతో మున్సిపాలిటీల్లో ఎన్నికల కళ రాగా, ప్రజలు పరిశీలించి ఓటు హక్కు ఉందా, లేదా.. ఏ వార్డులో ఉందని ఆరా తీస్తున్నారు.
వార్డులు మారాయి..
ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులపై వినతులు స్వీకరించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 100 అభ్యంతరాలు అందగా ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించారు. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో 30 ఫిర్యాదులు అందాయి. చాలా కుటుంబాల్లో ఒకరి ఓటు ఓ వార్డులో, ఇంకొకరి ఓటు మరో వార్డులో వచ్చినందున సరిచేయాలని కోరారు. మధిర మున్సిపాలిటీలో కూడా ఇదే తరహా వినతులు అందాయి. ఇళ్లు మారిన వారు తమ ఓటు హక్కును ప్రస్తుత వార్డుకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కల్లూరు మున్సిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేరే వార్డులో ఉన్నాయని 19 అభ్యంతరాలు నమోదయ్యాయి. వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతం వారు ఉంటున్న వార్డుకే ఓటు హక్కు బదలాయించడంపై దృష్టి సారించారు.
అంతటా ఎన్నికల మూడ్..
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసినప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. జాబితాలు పరిశీలించిన రాజకీయ నాయకులు తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరివైనా పేర్లు లేవా అని ఆరా తీస్తున్నారు. అంతేకాక ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎవరు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉందో కూడా పరిశీలిస్తున్నారు. ఈనెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో తమ సీటు కోసం నేతలు, ప్రజాప్రతినిదులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనే అంశంపై దృష్టి సారించాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన అభ్యంతరాలతో పాటు మార్పులు, చేర్పులను అధికారులు పరిష్కరిస్తున్నారు. అలాగే, సోమవారం మున్సిపాలిటీల్లో పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే, మంగళవారం జిల్లాస్థాయిలో సమావేశం పూర్తయింది. ఈ సమావేశాల్లో అందిన సలహాలను కూడా పరిగనణలోకి తీసుకుని 10వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై 100 అభ్యంతరాలు
పుర పోరుకు అడుగులు..


