సంక్రాంతికి వచ్చేయండి!
హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులు
పకడ్బందీగా ఏర్పాట్లు
● 1,368 బస్సు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు ● ఖమ్మం రీజియన్‌లో ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ● ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ
ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి 1,368బస్సు సర్వీసుల నిర్వహణకు సన్నాహాలు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగకు ముందుగానే ప్రత్యేక సర్వీసులు మొదలుపెట్టాలని నిర్ణయించగా, ఈ బస్సులు 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, అదనపు సర్వీసుల్లో సాధారణ చార్జీల కన్నా అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిమాండ్ ఆధారంగా రిజర్వేషన్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే, 11, 17వ తేదీల్లో మహాలక్ష్మి సర్వీసులు(పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్) బస్సుల్లో కాకుండా ఇతర సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
రద్దీకి అనుగుణంగా..
విద్యా, ఉద్యోగ, వృత్తి వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఉంటున్న వారు సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థలకు ఈనెల 10నుంచి సెలవులు మొదలుకానుండగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 9 నుండి 15వ తేదీ వరకు 799 సర్వీసులు నడిపిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు 569 బస్సు సర్వీసులు ఉంటాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనంగా బస్సులు నడిపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు.
రిజర్వేషన్ సౌకర్యం
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ నడిపించే అదనపు బస్సులకు సంస్థ రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు 365 రిజర్వేషన్ సర్వీసులను, తిరుగు ప్రయాణంలో 236 రిజర్వేషన్ సర్వీసులు నడిపిస్తారు.
తేదీ రిజర్వేషన్ నాన్ మొత్తం
రిజర్వేషన్ 9 68 80 148
10 68 80 148
11 68 88 156
12 68 88 156
13 68 88 156
14 15 20 35
15 10 20 30
ఇక తిరుగు ప్రయాణంలో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు ఈనెల 16న రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ కలిపి 90 సర్వీసులు నడిపిస్తారు. అలాగే, 17వ తేదీన 138, 18వ తేదీన 173, 19వ తేదీ 128, 20వ తేదీన 40 సర్వీసులు నడిపించేలా ప్రణాళిక రూపొందించారు.
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారి కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తాం. ఏపీకి వెళ్లే ప్రయాణికులు కూడా ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండడంతో ఈ ఏడాది సర్వీసుల సంఖ్య పెంచాం. ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఎంచుకునేలా ప్రచారం చేస్తాం.
– ఏ.సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్, ఆర్టీసీ
సంక్రాంతికి వచ్చేయండి!


