మామిడి ‘పండు’తుందా..?
నాలుగేళ్లుగా చీడపీడలు, ప్రకృతి
వైపరీత్యాలతో నష్టాలు
ఈ ఏడాది ఆశాజనకంగా పూత
కాలం కలిసొస్తుందనే భావనతో రైతులు
చీడపీడలు ప్రకృతి వైపరీత్యాలే కారణం
వేంసూరు: విదేశాలకు ఎగుమతి చేసే తోతాపురి, బంగినపల్లి తదితర మామిడి రకాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగవుతున్నా యి. ఖమ్మం జిల్లాలో సుమారు 32వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి.అయితే, మామిడి సాగు వ్యయం పెరుగుతుండడం.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వస్తుండడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలుచోట్ల మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రారంభించారు. వేంసూరు మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఇప్పుడు ఏడు వేల ఎకరాలకు పడిపోయింది. కాగా, నాలుగేళ్ల నుంచి వరుస నష్టాలు వస్తుండడంతో రైతులు దిగాలు చెందుతుండగా, ఈసారి పూతఆశాజనకంగా ఉండడంతో మెరుగైన దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.
పూతను కాపాడుకునేలా..
ఈసారి మామిడిచెట్లకు పూత గణనీయంగా వచ్చింది. ఇందులో సగమైనా కాతగా మారితే దిగుబడికి ఢోకా ఉండదని, లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఈ మేరకు నాలుగేళ్ల నుంచి నష్టాలు తప్ప లాభమన్నది ఎరగని రైతులు.. పూత, పిందెను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తూ తోటల్లో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలుచోట్ల తోటలను లీజ్‌కు తీసుకున్న తెలంగాణ, ఏపీ వ్యాపారులు మామిడితోటల్లో చీడపీడల నివారణ చర్యలు చేపడుతున్నారు.
వరుసగా నాలుగేళ్ల నుంచి మామిడి తోటలకు పెట్టుబడితోనే సరిపోతుంది. తెగుళ్లకు తోడు ఏదో ఒక కారణంతో నష్టాలే తప్ప లాభాల ముఖమే చూడలేదు. ఈసారి పూత బాగానే ఉన్నా, చివరకు నష్టాలే వస్తే మామిడి తోట తొలగించక తప్పదు. – అట్లూరి సత్యనారాయణరెడ్డి,
రైతు, అడసర్లపాడు
ఈ ఏడాదైనా మామిడి లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పటికే మామిడి తోటలు లీజ్‌కు తీసుకున్నాను. ప్రస్తుతం తోతాపురి తోటల్లో పూత ఆశాజనకంగా ఉంది. వాతావరణం కలిసొస్తే తోటలతో లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. – జంగ జమలయ్య,
మామిడి తోటల వ్యాపారి
జిల్లాలో ఒకప్పుడు వేంసూరు మండలంలో అత్యధికంగా మామిడి తోటలు ఉండేవి. ఈ మండలంలో 25వేలకు పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇప్పుడు కేవలం ఏడు వేల ఎకరాలకే పరి మితమైంది. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు మామిడి సాగుకు ప్రధాన సమస్యలుగా మారాయి. పూతదశలో ఏటా తేనె మంచుపురుగు, తామర పురుగు ఉధృతితో పెట్టుబడి పెరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఒకవేళ కాయ దశకు చేరినా మంగు తెగులుతో నష్టాలు, దీన్ని అధిగమించే సరికి ఈదురు గాలులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఓర్చుకుంటూ కాత వచ్చేసరికి జిల్లాలో మామిడి మార్కెట్ లేక మంచి ధర కోసం దక్షిణాది రాష్ట్రాల వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు.
మామిడి ‘పండు’తుందా..?
మామిడి ‘పండు’తుందా..?


