కబడ్డీ పోటీలకు అంతా సిద్ధం..
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
క్రీడాకారులకు ఆశ్రమ పాఠశాలలో వసతి
రాష్ట్రాలకు అనుగుణంగా వంటలు
పినపాక: ఈ–బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 7 నుంచి నిర్వహించే జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ఓ పక్క మొదలవుతుండగానే.. ఈ–బయ్యారం గ్రా మం క్రీడలకు సన్నద్ధం అవుతోంది. క్రీడాప్రాంగణంలో ఐదు మ్యాట్లు ఏర్పాటుచేశారు. సుమారు 200 నుంచి 300 మంది కూర్చొని తిలకించేందుకు గ్యాల రీలు సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు.
28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు
జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వారికి ఎల్సిరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. పిల్లల కు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. దీంతో వారంతా ఇంటికి వెళ్లడంతో వీరికి బస ఏర్పా టు చేశారు. బెడ్లు, ఫ్యాన్లు, దుప్పట్లు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టారు.
అన్ని రకాల వంటలు..
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వస్తున్న క్రీడాకారులకు రుచికరమైన భోజన ఏర్పాట్లను కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాలకు అనుగుణంగా వంటలను వండే విధంగా మాస్టర్లను సిద్ధం చేశారు. నార్త్ ఇండియా ఆటగాళ్లకు చపాతి, రోటీ, స్వీట్, దాల్‌ఫ్రై వంటి వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులకు అందించే భోజనంలో రాజీలేకుండా ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
కబడ్డీ పోటీలకు అంతా సిద్ధం..


