
‘రీల్స్ గర్ల్’ మోజులో గుండెవైద్య నిపుణుడు
భార్యకు శారీరక, మానసిక వేధింపులు..
దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర స్త్రీ, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది.
వరంగల్: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అత్తామామలకు చెప్పినప్పటికీ..
డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్‌కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.

రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా..
డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్‌లో తాను గుండె ఆపరేషన్‌ను లైవ్‌గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు.