సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు
ముఖ్యమంత్రిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
రాష్ట్రానికి సంబంధించి నేను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నానని నిరూపించాలి
అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం
ఆరు గ్యారెంటీల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే నాపై విమర్శలు
ధైర్యం ఉంటే హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసత్యపు వార్తలతో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అకారణంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టును తాను అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేద్దామని, తనపై ఆరోపణలకు ఉన్న ఆధారాలను వారికి ఇవ్వాలని అన్నారు.
వారు ఏ నివేదిక ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్‌క్లబ్‌లో గానీ, అమరవీరుల స్తూపం వద్ద గానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాటాకు చప్పుళ్లకు భయపడను..
‘పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను అంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా. వారి ఇళ్ల ముందే ఘెరావ్‌లు చేసి, ఉద్యమాలు చేస్తూ ఢిల్లీకి వచ్చా. అంబర్‌పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా. రేవంత్‌రెడ్డి సరి్టఫికెట్ నాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని.
ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోలీలు ఆడటం, పేగులు మెడలో వేసుకోవడం వంటి నీచమైన, చిల్లర రాజకీయాలు నాకు రావు. నేను మాటకారిని కాకపోయినా మాట మీద నిలబడే వ్యక్తిని. పదవుల కోసం పార్టీలు మారే రకం కాదు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి, అభద్రతాభావం, అహంకారంతో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
మంత్రులు దోచుకుంటున్నారు..
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వంచనలో, దోపిడీలో ఇరు పార్టీలది ఒకే వ్యవహారశైలి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి..’అని కేంద్రమంత్రి విమర్శించారు.
ఆఖరి గింజ వరకు కొంటామన్నారుగా..
‘రాష్ట్రం అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మెట్రో టేకోవర్‌కు కేంద్రమే రుణం ఇప్పించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతోంది. తెలంగాణలో దొడ్డు బియ్యం వాడకపోయినా, గోడౌన్లు ఖాళీ లేకపోయినా 53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలి. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణలో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం..’అని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రం నుంచి మరొకరికి చాన్స్!
ఈ నెలలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని, బీజేపీ పార్టీ కమిటీలను కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తారని విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్‌లో అవకాశం ఉంటుందన్నారు.


