రైల్వే టీటీఈలకు త్వరలో బాడీ కెమెరాలు
వారు విధుల్లో ఉన్నంత సేపు ఆడియో, వీడియో రికార్డు
టీటీఈలపై ప్రయాణికుల దాడుల నిరోధం ప్రధాన లక్ష్యం
వారిపై ని«ఘాకూ దోహదం
సాక్షి, హైదరాబాద్: నల్లటి కోటు, చేతిలో ట్యాబ్‌తో కనిపించే టీటీఈల ఛాతీపై ఇప్పుడు ఒక చిన్న ‘డిజిటల్ కన్ను’మెరవనుంది. ప్రయాణికులతో జరిగే వాగ్వాదాలు, టికెట్ లేని ప్రయాణికుల దౌర్జన్యాలు, లంచాల ఆరోపణలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే ‘బాడీ కెమెరా’లను ఏర్పాటు చేయబోతోంది. టీటీఈలు విధుల్లో ఉన్న సమయంలో ఈ మూడో కన్నే కీలకంగా మారబోతోంది. ఇటీవలి కాలంలో తరచూ రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు, టీటీఈలకు మధ్య తీవ్ర వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో టీటీఈలపై దాడులకూ దిగుతున్నారు. అలాంటి ఘటనలను సచిత్రంగా రికార్డు చేసేలా టీటీఈలకు ప్రత్యేకంగా బాడీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న రైల్వే, వాటి ఫలితాలను సమీక్షించి దేశవ్యాప్తంగా అమలుకు చర్యలు చేపట్టింది.
2023లోనే అనుకున్నా...
బాడీ కెమెరాల ఏర్పాటు ఆలోచన 2023లోనే మొగ్గతొడిగింది. కానీ, వేగంగా ముందుకు సాగలేదు. కొన్ని నెలల తర్వాత ‘ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేని ప్రయాణికుడు టీటీఈ విషయంలో దారుణంగా వ్యవహరించాడు. పెనాల్టీ వేయటంతో కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు టీటీఈని రైల్లోంచి తోసేయటంతో ఆయన చనిపోయాడు. మరో ఘటనలో.. గంగా–దామోదర్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేని మహిళా ప్రయాణికురాలికి టీటీఈ పెనాల్టీ విధించటంతో, కోపోద్రిక్తురాలైన ఆమె టీటీఈ తనపై లైంగిక దాడికి యత్రించాడని కేసు పెట్టింది. తర్వాత అది తప్పుడు కేసని తేలింది. ఈ నేపథ్యంలో టీటీఈల సంఘం డిమాండ్‌తో రైల్వే శాఖ కొన్ని రూట్లలో బాడీ కెమెరాలను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. వాటి ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని తేల్చి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తోంది.
ఎలా పనిచేస్తాయంటే...
ఈ కెమెరాలు చాలా తేలికగా, గట్టి ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీతో తయారై ఉంటాయి. టీటీఈలు ధరించే నల్లటి కోటు లేదా షర్ట్ జేబు వద్ద హెవీ–డ్యూటీ క్లిప్ అయస్కాంత హోల్డర్ సహాయంతో గట్టిగా అమర్చుతారు. టీటీఈలు నడుస్తున్నప్పుడు, రైలు కుదుపులకు ఈ కెమెరా ఊడిపోకుండా ఫిక్స్ చేస్తారు. టీటీఈ ప్రయాణికులతో మాట్లాడే ప్రతి మాటా స్పష్టంగా రికార్డ్ అవుతుంది. ఇది 1080హెచ్‌డీ క్వాలిటీతో వీడియోను రికార్డ్ చేస్తుంది. దీనికిఉండే 100 నుంచి 140 డిగ్రీల వైడ్–యాంగిల్ లె¯న్స్ వల్ల టీటీఈ ముందు నిల్చున్న వ్యక్తితోపాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా రికార్డు అవుతాయి.
ఇందులో ఉండే ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ టెక్నాలజీ వల్ల చీకటిలోకూడా స్పష్టంగా రికార్డవుతాయి. ఇవి నిరంతరాయంగా 12 గంటల పాటు రికార్డు చేయగలవు. వీటిలో 32 జీబీ స్టోరేజ్ ఉంటుంది. రికార్డయిన ఫుటేజీని టీటీఈలు స్వయంగా డిలీట్ చేయడం లేదా మార్చడం సాధ్యం కాదు. డ్యూటీ ముగిసిన తర్వాత ఈ డేటాను రైల్వే కంట్రోల్ రూమ్ సర్వర్‌కు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని లేటెస్ట్ మోడల్స్ జీపీఎస్ సదుపాయాన్నీ కలిగి ఉన్నాయి. దీనివల్ల ఆ టీటీఈ ప్రస్తుతం ఏ కోచ్‌లో, ఏ లొకేషన్‌లో ఉన్నాడో కంట్రోల్ రూమ్ నుంచి లైవ్‌లో ట్రాక్ చేయొచ్చు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలోని సిబ్బందికి ఈ బాడీ కెమెరాలను అందించనున్నారు.
టీటీఈలపై కూడా నిఘాకు...
చాలామంది టీటీఈలు కన్ఫర్మ్ టికెట్ లేని వారికి బెర్తులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రయాణికుల అవసరాలను గుర్తించి లంచాలు వసూలు చేస్తున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో టీటీఈల మీద నిఘా ఉంచేందుకూ ఈ కెమెరాలు అనువుగా ఉంటాయి.


