కాంక్రీట్ జంగిల్‌లా మారడంతో పెరిగిన ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం
వేసవిలో పశ్చిమ ప్రాంతంలో 5 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్న వేడి
ఇలానే కొనసాగితే 2040 నాటికి ప్రజాజీవనం దుర్భరమేనంటున్న పర్యావరణవేత్తలు
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో పచ్చదనం పెంపునకు పాటుపడాలని పిలుపు
భాగ్యనగరం స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు చెట్లుచేమలు, చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్‌ను తలపిస్తూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ వలసలతో నలువైపులా శరవేగంగా విస్తరిస్తుండటంతో పచ్చదనం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం పెరుగుతున్నాయని, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం తీవ్రమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా నగరం పశ్చిమం వైపు నిర్మాణాల సాంద్రత పెరగడంతో వేసవిలో ఇతర ప్రాంతాల కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు అధిక వేడి నమోదవుతోందని అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి నగరంలో ప్రజాజీవనం దుర్భరం అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మార్చాలంటే నగరవాసులు మొక్కలు నాటడమే కాకుండా నగరంలో అక్కడక్కడా మిగిలిన చెట్లు, చెరువులతోపాటు పట్టణ అడవులను కాపాడేందుకు తమ వంతు తోడ్పడాలని నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్
2040 నాటికి హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉండాలంటే..
» అర్బన్ ఫారెస్టులు పెంచాలి. ప్రతి కాలనీలో మినీ అర్బన్ ఫారెస్టును ఏర్పాటు చేయాలి.
» చెరువుల రక్షణ అత్యవసరం. చెరువులచుట్టూ గ్రీన్ బఫర్ ఏర్పాటు చేయాలి.
» గ్రీన్ రూఫ్స్,గ్రీన్ కారిడార్లు, వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలి.
» వందేళ్ల వయసున్న ప్రతి చెట్టుకూ ప్రత్యేక రక్షణ కల్పించాలి.
» ప్రతి పెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ సమతుల్యత తప్పనిసరి.
చెట్టు విలువ ఇదీ..
» ఒక పరిపక్వ చెట్టు ఏటా వందల కిలోల కార్బన్‌ను శోషిస్తుంది, ఆక్సిజన్ అందిస్తుంది.
» చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గిస్తుంది
» పక్షులకు నివాసం కల్పిస్తుంది
» వర్షపు నీటి సంరక్షణకు దోహదం చేస్తుంది
నగరంలో మిగిలి ఉన్న హరిత ప్రాంతాలు
కేబీఆర్ పార్కు, మహావీర్ హరిణి వనస్థలి పార్కు, మృగవని పార్కు, బొటానికల్ గార్డెన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా, గోల్కొండ పరిసరాలు, కీసర
అటవీ ప్రాంతం
చెట్ల వల్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీల దాకా తగ్గుతుంది
చెట్లు వాయు, ధ్వని కాలుష్యాల్ని తగ్గిస్తాయి. ఆకులపై తేమ గాలిలోని ధూళి కణాలను పట్టుకుంటుంది. గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఎండ తీవ్రతను తగ్గిస్తుంది. చెట్టు నీడలో ఉష్ణోగ్రత దాదాపు 7 నుంచి 10 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఆకుపచ్చ రంగు కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది. – డా. డబ్ల్యూజీ ప్రసన్నకుమార్, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ డైరెక్టర్
నగరానికి కావాల్సిన పచ్చదనం ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తికి కనీసం 9 చదరపు మీటర్ల పచ్చదనం ఉండాలి. కానీ గ్రీన్ స్పేసెస్ ఇన్ ఇండియా సహా వివిధ అధ్యయనాల ప్రకారం హైదరాబాద్‌లో ఆయా కాలాల్లో ఒక్కో వ్యక్తికి గ్రీన్‌స్పేస్ ఇలా ఉంది.



