
కోచ్ ఫ్యాక్టరీ నిర్వహణకు త్వరలో టెండర్లు
ఐసీఎఫ్‌కు టెండర్లు పిలిచే బాధ్యత అప్పగింత
ఏం ఉత్పత్తి చేయాలన్నదానిపై త్వరలో నిర్ణయం
ఉత్పత్తిపై ఢిల్లీలో త్వరలో రైల్వేశాఖ మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా నిర్మాణమవుతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్–ఆర్‌ఎంయూ) నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని రైల్వేశాఖ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ యూనిట్ నిర్వహణ, ఉత్పత్తిని చూసుకునే సంస్థను ఎంపికచేసే బాధ్యతను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కి రైల్వే బోర్డు అప్పగించింది. సంస్థ ఎంపికకు త్వరలో టెండర్లు ఆహ్వానించాలని ఆదేశిస్తూ తాజాగా ఐసీఎఫ్‌కు లేఖ రాసింది.
ప్రస్తుతం కాజీపేట ఫ్యాక్టరీలో జరుగుతున్న సివిల్ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయి. 2026 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నిర్మాణ పనులను రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) పర్యవేక్షిస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్మాణ బాధ్యతను పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్–టైకిషా జాయింట్ వెంచర్‌కు ఆర్‌వీఎన్‌ఎల్ అప్పగించింది. రైల్ కోచ్‌ల తయారీకి అవసరమైన అన్ని షెడ్లు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పనులను శనివారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించిన విషయం తెలిసిందే.
వైదొలగనున్న ఆర్‌వీఎన్‌ఎల్..
కర్ణాటకలోని యాద్గిర్‌లో ఉన్న రైలు బోగీల తయారీ కర్మాగారం నిర్వహణ, ఉత్పత్తి బాధ్యతను ఆర్‌వీఎన్‌ఎల్ ప్రస్తుతం నేరుగా పర్యవేక్షిస్తోంది. కాజీపేట ఫ్యాక్టరీలో ఉత్పత్తి బాధ్యతను కూడా ఆ సంస్థకే అప్పగిస్తారని భావించారు. కానీ, దానిని ప్రైవేటు సంస్థకు అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. టెండర్లు పిలిచి ప్రైవేటు సంస్థకు కాజీపేట ఫ్యాక్టరీని అప్పగించే బాధ్యతను ఐసీఎఫ్‌కు అప్పగించింది.
ఉత్పత్తిపై త్వరలో నిర్ణయం
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏదో ఒక నిర్ధారిత కాంపోనెంట్ ఉత్పత్తికి పరిమితం చేయకుండా, డిమాండ్ ఉన్న అన్ని రకాల కాంపోనెంట్ల ఉత్పత్తికి అనువుగా నిర్మిస్తున్నారు. ఇందుకు గాను ప్రధాన షెడ్‌లో నాలుగు బేస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వందేభారత్ రైళ్లు, సాధారణ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఎలక్ట్రిక్ మల్టీ పుల్ యూనిట్ (ఈఎంయూ లోకోమోటివ్)లను తయారు చేసేలా నిర్మిస్తున్నారు. అవసరమైతే సరుకు రవాణా వ్యాగన్లను కూడా తయారు చేస్తారు. వీటిల్లో మొదట వేటిని తయారు చేయాలో ఇంకా నిర్ణయించలేదు. శనివారం రైల్వే శాఖ మంత్రి అశి్వనీవైష్ణవ్ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో రైల్వే బోర్డు అధికారులతో సమీక్షించి నిర్ణయించాల్సి ఉంది. కానీ, సమయాభావం వల్ల ఆయన పర్యటన పావుగంటకే పరిమితమైంది. త్వరలో ఢిల్లీలో సమీక్షించి ఉత్పత్తిపై నిర్ణయం తీసుకోనున్నారు. నిర్ణయించిన కోచ్‌ల తయారీకి వీలుగా ఐసీఎఫ్ టెండర్లు పిలుస్తుంది.