రైతు భరోసాతో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రక కానుక
ఖరీఫ్ నుంచే 7 రకాల సన్న వడ్లకు బోనస్
రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.80 వేల కోట్ల వ్యయం
మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం అమలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులతో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నామని ప్రకటించారు.
"రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని... రైతు నవ్వితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని" అన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి రైతు హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు.
ఖరీఫ్ సీజన్ నుంచే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ అందిస్తామని ప్రకటించిన మంత్రి, రైతు పండించిన ప్రతి గింజకు విలువ పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ధాన్యం ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
రైతు అనుకూల విధానాలు, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగంగా రైతుల ఖాతాల్లో చెల్లింపులు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి లభ్యత వంటి చర్యలతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో రైతు సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామని చెప్పారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఇది దేశంలోనే రైతు సంక్షేమంపై అత్యధిక పెట్టుబడి పెట్టిన ప్రభుత్వాల్లో తెలంగాణను నిలబెట్టిందని తెలిపారు.
"మాటలు కాదు... చేతలు. హామీలు కాదు... అమలు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత" అని మంత్రి పేర్కొన్నారు. రైతు కష్టానికి గౌరవం, పంటకు గిట్టుబాటు ధర, సాగుకు భరోసా, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ రైతాంగం కోసం ప్రతి నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ పరమావధి అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


