గత ఆర్థిక సంవత్సర ప్రభుత్వ అంచనాలు, కాగ్ లెక్కలకు కుదరని పొంతన
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి (2025–26)గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలకు పొంతన కుదరలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతోపాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు, కాగ్ నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబా ట్లు, లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనని అంటున్న ఆర్థిక నిపుణులు.. అసహజ వ్య త్యాసం ఉండటం మాత్రం అరుదైన విషయమని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పన్ను ఆదాయం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వరకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికలకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం కనిపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పన్ను రాబడుల కింద రూ. 1.34 లక్షల కోట్లుకుపైగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి మాసాంతానికే పన్ను రాబడులు రూ. 1.39 లక్షల కోట్ల మేరకు వచ్చినట్లు ‘కాగ్’నివేదికలో పేర్కొంది. అంటే ఒక నెల మిగిలి ఉండగానే రూ. 5 వేల కోట్లు ఎక్కువగా పన్ను రాబడులు వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఇక మార్చిలో పన్ను ఆదాయం మరో రూ. 12 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వ లెక్కలకు, కాగ్ అంకెలకు మధ్య పన్ను రాబడుల విషయంలో సుమారు రూ. 17 వేల కోట్ల మేర వ్యత్యాసం వస్తోంది. అప్పుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఏడాది మొత్తం మీద రూ. 77,545.92 కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు ప్రభుత్వం చూపింది. కానీ ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికే రూ. 77,111 కోట్ల మేర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు వెల్లడించింది. అయితే మార్చిలో తీసుకొనే అప్పుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు అప్పులు తగ్గే అవకాశముంది కానీ.. ఏ మేరకు చెల్లింపులు జరిగి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాగ్’లెక్కల్లో వచ్చిన తేడా మేరకు కనీసం రూ. 6 వేల కోట్లయినా అప్పుల కంటే చెల్లింపులు ఒక్క నెలలోనే చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏడాది మొత్తం మీద రూ. 29,471 కోట్లు వచ్చాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొంటే ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికి రూ. 18,788 కోట్లు మాత్రమే రావడం గమనార్హం.
అంటే మార్చి నెలలోనే సుమారు రూ. 9 వేల కోట్లు కేంద్రం నుంచి ఉంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక గ్రాంట్–ఇన్–ఎయిడ్ విషయానికి వస్తే ఏడాది మొత్తంలో రూ. 11,161 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఫిబ్రవరి నాటికి రూ. 6,140 కోట్లు మాత్రమే వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలలో కేంద్రం నుంచి మరో రూ. 5 వేల కోట్లు రావాలన్నమాట. అయితే ప్రభుత్వ అంచనాలు, ‘కాగ్’లెక్కల్లో తేడాలు సహజమేనని.. లెక్కలు తీసుకొనే నాటికి అందుబాటులో కొన్ని వివరాలు లేకపోవచ్చని.. చెల్లింపులు, సర్దుబాట్ల కారణంగా కూడా కొంత తేడా వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ మేరకు తేడా రావడం మాత్రం పరిశీలించాల్సిన అంశమని అంటున్నారు. అంకెల గారడీ కోసం అంచనాలను రూపొందించకుండా వాస్తవిక దృక్పథంతో వెళ్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు.
ఏమిటీ నివేదికలు?
వాస్తవానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలతోపాటు ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక రూపొందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పంపే వివరాల ప్రకారమే ఈ నివేదికలు తయారవుతాయి. అలాగే ఏటా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అంతకుముందు ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఈ సవరించిన అంచనాలను ఏడాది మొత్తానికి (బడ్జెట్ పెట్టే మార్చి నెల రాబడులు, వ్యయాల అంచనాలను లెక్కగట్టి) ప్రతిపాదిస్తుంది. ఇదే తరహాలో గత నెల 20న 2025–26 సవరించిన అంచనాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ శనివారం ‘కాగ్’వెబ్‌సైట్‌లో ఓ నివేదిక పెట్టింది. ఈ రెండింటి మధ్య రాబడులు, ఖర్చులు, కేంద్ర నిధుల విషయంలో తేడాలు ఉండటం గమనార్హం.


