
హైకోర్టు గడువు ముంచుకొస్తుండటంతో సర్కారు నిర్ణయం
అంతకుముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు జీవో
ముందు ఎస్‌ఈసీ షెడ్యూల్.. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
రిజర్వేషన్ల ఖరారుకు అర్ధరాత్రి వరకు అధికారుల కసరత్తు
సీల్డ్ కవర్లలో జిల్లా కలెక్టర్లకు నివేదికలు
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కారు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారాంతంలోగా వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెలా ఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆలోగానే నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఆ ఆదేశాలను పాటించినట్టు అవుతుందని ప్రభుత్వం భావి స్తున్నట్టు సమాచారం. దీనికిముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, ఆ వెంటనే ఎన్నికల నిర్వహణ తేదీ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) సమాచారం తెలియజేస్తుందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.
ముందుగా ఎస్‌ఈసీ షెడ్యూల్ జారీ చేస్తుందని, మరుసటిరోజు నోటిఫికేషన్ విడుదల చేయొ చ్చునని చెబుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ లేదా ప్రణాళిక శాఖ జీవో జారీ చేసిన తర్వాత, దీని ఆధారంగా పంచాయతీరాజ్ అధికారులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లపై జీవో జారీ చేస్తారని అంటున్నారు.
రిజర్వేషన్లు బయటకు పొక్కొద్దు..
మంగళవారం కల్లా ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలు, వార్డు స భ్యులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అర్థరాత్రి దాకా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసిన అధికారులు, సిబ్బంది.. ఆ మేరకు నివేదికలను సీల్డ్‌కవర్లలో జిల్లా కలెక్టర్లకు అందజేసినట్టు సమాచారం. ఖరారు చేసిన రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి వెల్లడించవద్దని అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వీటిపై వివరాలు చెప్పడానికి పీఆర్ ఆర్‌డీ అధికారులు, సిబ్బంది నిరాకరిస్తున్నారు. కాగా క్షేత్రస్థాయిలో వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉండడంతో వీటి ఖరారుకు అధిక సమయం పట్టినట్టు తెలుస్తోంది.
వార్డు సభ్యులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లు కూడా..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేశాక...జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన రిజర్వేషన్ల జాబితాలను పరిశీస్తారు. ఏమైనా మార్పు చేర్పులుంటే సరి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తొలుత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. అయితే వీటితో పాటు వార్డు సభ్యులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లు కూడా పూర్తి చేయాలనే ఆదేశాలతో.. వాటిని కూడా జిల్లా, మండల, గ్రామ అధికారులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేయాల్సి ఉండగా, అది కూడా పూర్తయినట్టు ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు...
ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. దీని ద్వారా అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో పూర్తి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ జెడ్పీలు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో గెలిచుకునేందుకు వీలుగా ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వారం లోగా నోటిఫికేషన్ వెలువడితే..మూడు వారాల వ్యవధిలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇవి ముగిశాక కొన్నిరోజుల అంతరంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత మూడు వారాల వ్యవధిలోనే ఆ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ నెలాఖరులోగా నోటిఫికేషన్ సాధ్యం కాని పక్షంలో..కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంతవరకు జరిపిన కసరత్తుకు సంబంధించిన వివరాలు హైకోర్టుకు తెలియజేసి మరింత సమయం కోరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
రిజర్వేషన్లు ఇలా..!
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే..జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీపీలు) 31, జెడ్పీటీసీ స్థానాలు 565 , మండల ప్రజాపరిషత్‌లు 565, ఎంపీటీసీ స్థానాలు 5,763, గ్రామపంచాయతీలు– 12,760, వార్డుల సంఖ్య 1,12,534 గా ఖరారు అయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570, ఎంపీటీసీలు 5,817, గ్రామపంచాయతీలు 12,848గా ఉన్నాయి.
అయితే ఇప్పుడు 1 జెడ్పీపీ, 5 జెడ్పీటీసీ, 5 ఎంపీపీలు, 54 ఎంపీటీసీ స్థానాలు, 185 గ్రామ పంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గుదలకు ఇది కారణంగా నిలుస్తోంది.