సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ భారీ షాకిచ్చింది. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల బేసిక్ పే (ప్రాథమిక వేతనం), పెన్షన్ల నుంచి ప్రతి నెలా 1.5 శాతం కోత విధించాలని నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సరికొత్త నిబంధన జూన్ నెల నుంచి అధికారికంగా అమలు కానుంది. మే నెల వేతనాలు, పెన్షన్ల నుంచే ఈ ఈహెచ్‌ఎస్ చందా కటింగ్స్ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హెల్త్ స్కీమ్ ట్రస్ట్‌ను బలోపేతం చేసేందుకు కేవలం ఉద్యోగులపైనే భారం వేయకుండా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ తన ప్రాథమిక వేతనం నుంచి ఎంత మొత్తాన్ని అయితే చందాగా చెల్లిస్తారో, అంతే సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ హెల్త్ ట్రస్ట్‌కు జమ చేయనుంది.
ఈ నిబంధనలో ఉద్యోగ దంపతులకు ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ, ఇద్దరి జీతాల నుంచి కాకుండా ఒకరి బేసిక్ పే నుంచి మాత్రమే 1.5% కోత విధిస్తారు.
ఒకవేళ ఉద్యోగి–పెన్షనర్ దంపతులైనా సరే ఈ మినహాయింపు వర్తిస్తుంది. పొరపాటున ఇద్దరి జీతాల నుంచి డూప్లికేట్ డిడక్షన్ (రెండు సార్లు కటింగ్) జరిగితే, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ నిర్ణయంతో ఈహెచ్‌ఎస్ ట్రస్ట్‌కు భారీగా నిధులు సమకూరనున్నాయి. అయితే ఈ వేతనాల కోతపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నుంచి ఎలాంటి స్పందన రానుందో చూడాలి.


