పంటలకు ‘కట్‌’కట! | Sakshi
Sakshi News home page

పంటలకు ‘కట్‌’కట!

Published Fri, Feb 3 2023 2:15 AM

Telangana Farmers Situation Of Electricity Supply For Agriculture - Sakshi

రైతు: సర్‌.. నమస్తే! 
ఏఈ: నమస్తే..చెప్పండి 
రైతు: సర్‌.. త్రీఫేజ్‌ కరెంట్‌ ఏమైంది? ఇట్లా కట్‌ చేస్తున్నారు? 
ఏఈ: (మధ్యాహ్నం) మూడింటికి త్రీఫేజ్‌ తీయమన్నారండి. మూడింటికి తీస్తున్నాం. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మూడింటి వరకు ఇవ్వమన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఇస్తారో తెల్వదు. 
రైతు: ఎన్నిరోజులు సర్‌ ఇట్లా? 
ఏఈ: తెల్వదండి మాకు. ఇన్‌ఫర్మేషన్‌ ఏం ఉండదు. పై నుంచి ఎలా వస్తే అలా ఫాలో అవుతున్నాం. 
రైతు: 24 గంటలు అంటున్నారు. కనీసం 10 గంటలు కూడా కరెంట్‌ ఇస్తలేరు. నైట్‌ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎండలు కొడ్తున్నాయి. ఇన్ని రోజుల్లాగా కాకుండా ఇప్పుడు పంటలకి వాటర్‌ అవసరం. మందు కొడ్తామన్నా నీళ్లు లేవు. ఒకసారేమైన (కరెంట్‌) ఆన్‌ చేయగలుగుతరా సర్‌? 
ఏఈ: లేదండి.. సాధ్యం కాదు. పై నుంచి ఆర్డర్స్‌ కదా. మనం ఏమీ చేయలేం. 
రైతు: 24 గంటలని చెప్పి ఇట్లా కట్‌ చేస్తే మా పంటలు ఏం కావాలి? ఇప్పుడు కరెంట్‌ తీస్తే ఎట్లా?  
 .. మహబూబాబాద్‌ జిల్లా గూడూరుకు చెందిన ఓ రైతు, విద్యుత్‌ శాఖ ఏఈ మధ్య ఇటీవల జరిగిన ఈ ఫోన్‌ సంభాషణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరా పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రైతు కాల్‌ను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అనధికారికంగా గణనీయ స్థాయిలోనే కోతలు అమలవుతున్నాయి. వ్యవసాయానికి కేవలం 8–10 గంటలు మాత్రమే.. అదీ ఉదయం, రాత్రి రెండు దఫాలుగా త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా జరుగుతోంది. జిల్లాలు, సబ్‌స్టేషన్ల వారీగా సరఫరా వేళల్లో తేడాలు ఉంటున్నాయి.

మధ్య మధ్యలో విద్యుత్‌ ట్రిప్‌ అవుతుండటంతో మోటార్లు ఆగిపోయి.. పంటలకు నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు. వేసవికి ముందే కోతలు మొదలవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నిర్మల్, గద్వాల, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో పలువురు రైతులు ఆందోళన బాట పట్టారు. విద్యుత్‌ వినియోగ అంచనాలు తప్పడం, భారీ నష్టాల నేపథ్యంలో బహిరంగ కొనుగోళ్లను తగ్గించడమే కోతలకు కారణమని ట్రాన్స్‌కో వర్గాలు చెప్తున్నాయి. 

వినియోగ అంచనాలు తప్పడంతో.. 
రాష్ట్రంలో మొత్తం 1,65,48,929 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. గృహ విద్యుత్‌ కనెక్షన్లు 72.85 శాతం, వ్యవసాయ కనెక్షన్లు 15.49 శాతం, పరిశ్రమలు, ఇతర వాణిజ్య కనెక్షన్లు 11.66 శాతం ఉన్నాయి. లెక్కల ప్రకారం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 27 లక్షలకుపైగా ఉంటుంది. గత ఏడాదికి కంటే ఈసారి 5 నుంచి 10 శాతం వరకు విద్యుత్‌ వినియోగం పెరగొ చ్చని అధికారులు అంచనా వేసుకుంటే.. ఇప్పటికే 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్టు సమాచారం. 

భారీ నష్టాలు.. తగ్గిన కొనుగోళ్లు.. 
వ్యవసాయానికి 24 గంటల ఉచిత సరఫరాతో డిస్కంలపై భారం పడుతోంది. మరోవైపు కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలతోపాటు ప్రభుత్వ శాఖలు/విభాగాల నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లించక.. డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఎన్నడూ లేనట్టుగా 2022–23లో రూ.5,597 కోట్ల మేర చార్జీలను పెంచినా డిస్కంల నష్టాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లను విద్యుత్‌ సంస్థలు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రోజుకు రూ.70–100 కోట్ల ఖర్చుతో 20–30 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.20–30 కోట్లతో 5 మిలియన్‌ యూనిట్లలోపే కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. 

వేసవిలో కష్టమే! 
వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతుందని విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్టంగా 14,160 మెగావాట్ల డిమాండ్‌ నమోదవగా.. ఈసారి 16,000 మెగావాట్ల వరకు ఎగబాకే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో విద్యుత్‌ కొరత, ధరలు భారీగా పెరగొచ్చని అంటున్నాయి. దీనితో గృహ వినియోగానికీ కోతలు పెట్టక తప్పని పరిస్థితి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు చెప్తున్నాయి. 


ఈ ఫొటోలోని రైతు గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురానికి చెందిన కృష్ణయ్య. నాలుగెకరాల భూమి, అందులో 2 బోర్లు ఉన్నాయి. యాసంగిలో ఎకరా పొగాకు సాగు చేశాడు. 3ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమైనా.. కరెంటు కోతలు మొదలవడంతో ఒక ఎకరాలోనే వరి నాటు వేశాడు. మిగతా రెండెకరాలు బీడుగానే వదిలేశాడు. ఇప్పటికీ రాత్రి, పగలు బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ పొగాకు, వరికి నీరు పారించుకుంటున్నట్టు చెప్తున్నాడు.

రోజంతా బావి వద్దనే.. 
యాసంగిలో రెండెకరాల్లో మొక్కజొన్న వేశా. పంట 45 రోజుల వయసులో ఉంది. పది రోజులుగా కరెంటు సరిగా ఉండటం లేదు. త్రీఫేజ్‌ కరెంట్‌ తరచూ ట్రిప్‌ అవుతోంది. రెండు, మూడు గంటలు కూడా నీరు పారడం లేదు. రోజంతా పడిగాపులు కాస్తూ మోటార్‌ ఆన్‌ చేసుకోవాల్సి వస్తోంది. మరో 10 రోజులు ఇలాగే ఉంటే పంట దెబ్బతింటుంది. – జంగిలి రవి, గుడ్డెలుగులపల్లి, దుగ్గొండి, వరంగల్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement