
3 రోజుల పాటు ప్రజల్లోకి పీసీసీ అధ్యక్షుడు
కరీంనగర్ జిల్లా చొప్పదండి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటల్లో యాత్ర
స్థానిక ఎన్నికలపై నేడు మీనాక్షి జూమ్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మలి విడత పాదయాత్ర ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మహేశ్‌గౌడ్ మరోమారు ప్రజల్లోకి వెళ్లనున్నారు. యాత్ర షెడ్యూల్‌ను గాంధీభవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. 24న సాయంత్రం 5 గంటలకు మహేశ్‌గౌడ్ చొప్ప దండిలో పాదయాత్ర ప్రారంభిస్తారు. 25న ఉదయం అక్కడే శ్రమదానంచేసి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పాదయాత్ర జరుగుతుంది. 26న ఉదయం శ్రమదానం, ఆ తర్వాత వరంగల్ జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. కాగా, 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మహేశ్‌గౌడ్ భేటీ కానున్నారు.
అదేవిధంగా ఈ నెల 16వ తేదీన జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ అధికారిక నిర్ణయం తీసుకోనున్నందున ముందస్తుగా క్షేత్రస్థాయి నేతలతో మీనాక్షి సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం జరిగే జూమ్ సమావేశానికి హాజరు కావాలని డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌లకు ఆహ్వానం అందింది.