
దాదాపు 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
హైడ్రా కూల్చివేతలు.. సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం ప్రకటించాలి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్..అర్బన్ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ–కార్ రేస్ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ హయాంలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందన్నారు.
కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు మరి స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ‘మిస్ మేనేజ్‌మెంట్’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.