మాట్లాడుతున్న అభిజిత్ బెనర్జీ. చిత్రంలో రతిన్‌రాయ్, మురళీధరన్
మంచి ఉద్దేశంతో భారీగా వ్యయం చేసినా.. ఫలితం లేకపోవచ్చు
మన జనాభాకు 15 వేల మంది ఎంపీలు కావాలి.. ఇప్పుడున్న పార్లమెంట్ పనిచేయడం లేదు..
బ్రిటన్‌లో దాదాపు 7 కోట్ల జనాభాకు 650 మంది ఎంపీలు
చర్చాగోష్టిలో ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, కార్తీక్ మురళీధరన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విధానాల రూపకల్పన, వాటి అమలుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి పరిమితమై.. అమలు బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించడం మంచిదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూనే.. వాటి అమ లు, నిర్వహణకు సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేలా చూడాలని సూచించారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్ని పథకాలపై భారీగా నిధులు వ్యయం చేసినా.. అస్సలు ఫలితమివ్వక తెల్ల ఏనుగుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన ‘అభివృద్ధి–పరిపాలన–పేదరికం ఓ సమస్య’అన్న అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆర్థికవేత్తలు పాల్గొనగా.. రతిన్‌రాయ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
న్యూట్రిషన్ ఆహారంపై తక్కువ వ్యయం
దేశంలోని 140 కోట్ల మందికి లోక్‌సభలో ఉన్నది కేవలం 543 మంది ఎంపీలు మాత్రమేనని, అదే బ్రిటన్‌లో దాదాపు ఏడు కోట్ల జనాభా ఉంటే.. అక్కడ 650 మంది ఎంపీలు ఉన్నారని అభిజిత్ బెనర్జీ చెప్పారు. మన దగ్గర ఉన్న జనాభాకు దాదాపు 15 వేల మంది ఎంపీలు కావాల్సి వస్తుందంటూనే... మన పార్లమెంట్ ఇప్పటికే డీఫంక్ట్ అయిందని అభిప్రాయపడ్డారు. న్యూట్రిషన్ ఆహారంపై తక్కువ వ్యయం చేస్తూ.. ఇతర అంశాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. న్యూట్రిషన్ ఆహారం అందించడం అంటే.. ఏదో నాణ్యతలేని ధాన్యాలను అందించడం వ్యాపార దృక్పథం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణకు
అంగీకరించరు..
అధికార వికేంద్రీకరణకు అధికారంలో ఉన్నవారెవరూ సులభంగా అంగీకరించరని, అధికారం ఒకరు ఇస్తే తీసుకునేది కాదని, దానిని లాక్కోవాలని ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రాల్లో బ్యూరోక్రసీ చేసే నియామకాలు వాస్తవానికి క్షేత్రస్థాయిలో అవగాహనతో చేయరని విమర్శించారు. రాష్ట్రాలు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన దగ్గర పెట్టుకుందని విమర్శిస్తుంటాయని, కానీ అదే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం స్థానిక సంస్థలకు అధికారాల వికేంద్రీకరణకు అంగీకరించరని చెప్పారు. ట్రంప్ ఇస్తున్న షాక్‌లతో అమెరికాలో ఉండే భారత నిపుణులు తిరిగి స్వదేశానికి వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్నారు.
ప్రభుత్వాలు సత్ఫలితాలు ఇవ్వని నీటిపారుదల పథకాలపై ఎలా నిధులు వ్యయం చేస్తున్నాయనే అంశంపై మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో నీటిపారుదల రంగంపై దాదాపు రూ.5 లక్షల కోట్లు వ్యయం చేసి నా కొత్తగా సాగులోకి వచి్చన ఆయకట్టు జీరో’అని అన్నారు. ప్రాజెక్టులను కాంట్రాక్టర్లకు అప్పగించడంలో ఉన్న ఆసక్తి రాజకీయ నాయకులకు వాటిని పూర్తిచేయడంపై ఉండదని చెప్పారు. పూర్తయిన వాటి నిర్వహణకు నిధుల కేటాయింపు ఉండదని తద్వారా అవి నిరుపయోగం అవుతున్నాయన్నారు.


