
సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.
హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2017 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్‌ల ధర్మాసనం పిటిషన్‌ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.