పైరసీ భూతంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఐ-బొమ్మ(ibomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని.. సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది.
ఇమ్మడి రవికి, అతని భార్యకి కొంత కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులోనూ నడుస్తోంది కూడా. ఈ క్రమంలో.. విడాకుల కేసు కోసమే రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు తెలుస్తోంది. అలా.. భార్య అందించిన టిప్పుతో రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.
చంచల్‌గూడ జైలుకు రవి..
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో రవిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. I BOMMA , BAPPAM వెబ్ సైట్‌లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. పైరసీ కంటెంట్‌తో బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేశాడని తెలుస్తోంది.
కంటెంట్‌ను ఆపేసి..
ఇక విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లనూ కూడా గుర్తించారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు..
ఇమ్మడి రవి స్వస్థలం విశాఖలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ ఉదయం నుంచి సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. అతని స్నేహితులనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది.
గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో గతంలో పోలీసులకి, సినీ పెద్దలకి ఐ-బొమ్మ ఓ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ దాకా వస్తే.. పోలీసుల సంగతి చూడాల్సి వస్తుందంటూ ఓ బహిరంగ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ వ్యవహారంలోనూ రవి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.


