వందే భారత్‌కు తప్పని రాళ్ల దెబ్బలు

Stones pelting on Vande Bharat train - Sakshi

తిరుపతి వందేభారత్‌ ఆరు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

విశాఖ రైలు మూడు కోచ్‌లలో అదే పరిస్థితి

ఆకతాయిలపై ఇక మరింత కఠినచర్యలంటున్న రైల్వే అధికారులు

ఇది సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌
రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్‌ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణి­కుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్‌

వందేభారత్‌ రైళ్లపైనే కసిగా..
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్‌ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది.

సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్‌ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్‌ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది.  ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్‌–­విశాఖపట్నం, సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి.

ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్‌ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్‌లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు.

సికింద్రాబాద్‌ డివిజన్‌లోనే ఎక్కువగా..
తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్‌ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్‌ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్‌ డివిజన్‌లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి  రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు.

అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top