
కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా ఘటన
గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది.
ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.