
సత్ఫలితాలు ఇస్తున్న స్లాట్ బుకింగ్ విధానం
ఇప్పటికే 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు
సాక్షి, హైదరాబాద్: స్లాట్ బుకింగ్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. రెండో దశలో మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణల్లో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరాస్తి దస్తావేజుల సత్వర రిజిస్ట్రేషన్ల కోసం ప్రయోగాత్మకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా గత నెల 10వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆజంపురా, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ (Champapet) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి రెండో విడతగా హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లతోపాటు ఫరూక్ నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్‌కేసర్, నారపల్లి, మల్కాజ్‌గిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ (Slot Booking) ద్వారా స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కలగనుంది.
అర్ధగంటలోనే...
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం అర్ధగంటలోపు దస్తావేజుల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది. ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజుల రిజిస్ట్రేషన్ల కోసం సమర్పించే పద్ధతి కూడా అడ్డుకట్ట పడినట్లయింది. దస్తావేజుల తాకిడి వల్ల జరిగే జప్యాన్ని నివారించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు రోజువారీగా కనీసం 48 స్లాట్ల చొప్పున కేటాయిస్తున్నారు. దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్ రిజిస్ట్రార్లలో మాత్రం 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి.
ఈ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే దస్తావేజుల స్లాట్ల టైమింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతోంది. స్లాట్ బుక్ చేసుకొని అత్యవసర దస్తావేజుదారుల కోసం ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ (First Come First Serve) పద్ధతిలో దస్తావేజులు స్వీకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.