
50కి పైగా దేశాల సుందరీమణుల రాక
ఘనంగా స్వాగతం పలికిన పర్యాటక శాఖ
ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి భాగ్యనగరంలో అడుగుపెట్టిన అందాల భామలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే ఫిలిప్పీన్స్, మయన్మార్, వియత్నాం, అమెరికా, అర్మెనియాతో పాటు మొత్తం యాభైకి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో పాటు మరో 25 మందికి పైగా విదేశీ ప్రతినిధులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం (Welcome) పలికింది. స్వాగత సమయంలో కొత్త అనుభూతికి లోనవుతున్న విదేశీ అందగత్తెలు స్వాగతం పలికే నృత్యకారులతో పాటు స్టెప్పులేశారు.
13న మిస్ వరల్డ్ పోటీదారులతో హెరిటేజ్ వాక్
తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పర్యాటక శాఖ సంచాలకులు జెడ్.హనుమంతు కొండిబా, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13న చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్‌తోపాటు, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ సందర్శన వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని చేయాల్సిన ఏర్పాట్ల కోసం బుధవారం పాతబస్తీలో పర్యటించారు. బందోబస్తుతోపాటు ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 13న మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ పాతబస్తీని సందర్శించి చారి్మనార్ వద్ద హెరిటేజ్ వాక్‌తోపాటు లాడ్ బజారు, చౌమహల్ల ప్యాలెస్‌ను సందర్శించనున్నారని తెలిపారు.

పాతబస్తీతోపాటు తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్, రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారని అన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మిస్ వరల్డ్ 2025.. ఆ దేశాలు డుమ్మా