
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెర లేచింది. మరో 3 వారాల పాటు నగరవాసులకు వైవిధ్యభరిత అనుభూతులను అందించనున్న ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30దేశాలు తగ్గినట్లయ్యింది.
మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీకి ప్రారంభంలో 140 దేశాలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత ఈ సంఖ్యను 116కు కుదించారు. మొత్తం మీద చూస్తే.. తాజా సమాచారం ప్రకారం, ఈ పోటీలో 109 దేశాలకు చెందిన సుందరీమణులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.
పోటీలో పాల్గొనని దేశాల్లో..
కోస్టారికా, ఇరాక్, లెసోతో, లైబీరియా, గినియాబిస్సావు, లైబీరియా, మకావ్, మొరాకో, నార్వే, స్లోవేకియా, టాంజానియా, ఉరుగ్వే తదితర దేశాలు ఉన్నాయి.
స్పాన్సర్‌షిప్ లేక..
తమ దేశాల్లో జాతీయ స్థాయి పోటీలు సరిగా నిర్వహించలేకపోవడం, ప్రతినిధులను నియమించలేకపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో అవి పాల్గొనడంలేదు. లెసోథోకు చెందిన లెరాటో మాసిలా, టాంజానియాకు చెందిన ట్రేసీ నబుకీరా పంపించేందుకు స్పాన్సర్‌షిప్ లేక పోటీల నుంచి తప్పుకున్నారు. గినియా–బిస్సా, ఇరాక్, మాకావ్, ఉరుగ్వే దేశాలు తమ జాతీయ ఫ్రాంచైజ్ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోయాయి. నార్వేకి చెందిన నికోలిన్
ఆండర్సన్, తాను వ్యక్తిగత ప్రాజెక్టుల వల్ల మిస్ వరల్డ్‌కు హాజరుకాకపోవడంతో, ఆమెను మిస్ ఇంటర్నేషనల్‌కు పంపించారు. సరైన ప్రోత్సాహం, ఆర్థిక పరమైన మద్దతు లేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ టాంజానియా ట్రేసీ నబుకీరా వైదొలిగారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చాలా పరిశీలించి ఆలోచించిన తర్వాత, మిస్ వరల్డ్ 2025లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ.. కావాల్సిన మద్దతు దొరకకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం బాధ్యత వహించాల్సిన సంస్థ నుంచి తగినంత సన్నద్ధత లేని కారణంగా, ప్రపంచ వేదికపై టాంజానియాకు ప్రాతినిధ్యం వహించలేనని భావిస్తున్నా. మిస్ టాంజానియా టైటిల్ పట్ల ఇప్పటికీ చాలా గర్వపడుతున్నాను. నా ప్రాజెక్ట్, స్టెప్ బై స్టెప్ ద్వారా నా వంతు సామాజిక సేవ చేయడానికి నా గుర్తింపును ఉపయోగించుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో ఓపికగా, మద్దతుగా నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు.
ఆఖరి నిమిషం వరకు ఆ దేశాలు..
కొన్ని దేశాలు చివరి క్షణం వరకూ మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. తమ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయి. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జస్టినా జెడ్నికోవా స్థానంలో అడేలా స్ట్రోఫెకొవా ఎంపికయ్యారు. ట్యూనీషియాకు చెందిన అమీరా అఫ్లీకి బదులుగా లామిస్ రెడిసి పోటీలో పాల్గొననున్నారు.
బెలీజ్‌కు చెందిన నొయెలియా హెర్నాండెజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో షయారి మోరటాయా ఎంపికయ్యారు. కొట్ డి ఇవోరికి చెందిన మారీ ఎమ్మానుయేల్ డైమాలా స్థానంలో ఫటౌమటా కూలిబాలీ వస్తున్నారు. నమీబియాకు చెందిన అల్బర్టినా హైంబలా స్థానంలో సెల్మా కామాన్యా భర్తీ అయ్యారు. కంబోడియాకు చెందిన మానితా హాంగ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో జూలియా రస్సెల్ ఎంపికయ్యారు.
మాల్డోవాకు చెందిన మికాయెలా నికోలాలేవ్‌ను ఏంజెలినా చిటైకా భర్తీ చేశారు. కొంతకాలం విరామం తర్వాత ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో తిరిగి పాల్గొంటున్న దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, ఆర్మేనియా, ఈక్వటోరియల్ గినియా, కిర్గిజిస్తాన్, లాట్వియా, నార్త్ మాసిడోనియా, సూరినామ్, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్, జాంబియాలు ఉన్నాయి.