Reita Faria: తొలి అందాల డాక్టర్‌ రీటా ఫారియా | Winner Of Miss World In 1966 First Indian And First Asian Reita Faria, Know Interesting Facts About Her In Telugu | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌ ఎంపికైన తొలి మెడికల్‌ డాక్టర్‌..!

May 8 2025 8:26 AM | Updated on May 8 2025 9:51 AM

Reita Faria: Winner of Miss World in 1966 First Indian first Asian

రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్‌ కూడా! అంతేకాదు మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్‌ డాక్టర్‌! ఇన్ని ఫస్ట్‌లను ప్రీఫిక్స్‌గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ డేవిడ్‌ వెల్‌ను పెళ్లి చేసుకుని ఐర్లండ్‌లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్‌ పర్సన్సే గోల్ఫ్‌లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్‌ లెగ్స్‌’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్‌లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్‌బాల్, బాడ్మింటన్‌ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్‌ వేస్తారు. డాక్టర్‌ అయ్యి.. మంచి ఫిజీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. 

అసలు మిస్‌ వరల్డ్‌ కోసం ప్రయాణం... 
రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్‌ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్‌ వరల్డ్‌ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్‌ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే (1966) మిస్‌ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్‌ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్‌ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. 

అక్కడా టైటిల్‌ ఆమెనే వరించింది. తర్వాత మిస్‌ వరల్డ్‌ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్‌ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్‌ ఎక్కారు. మిస్‌ వరల్డ్‌ పాజెంట్‌ కోసం కూతురు ఒంటరిగా లండన్‌ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. 

మినిస్టర్‌ కూతురు చీర.. సేల్స్‌లో హీల్స్‌.. 
మిస్ట్‌ వరల్డ్‌ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్‌ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్‌ వరల్డ్‌ నైట్‌.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్‌ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్‌ వేర్‌లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్‌ ట్రెడిషనల్‌ వేర్‌గానూ ప్రెజెంట్‌ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్‌ ఇండియా ఏజెంట్‌ ఆర్గనైజేషన్‌తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్‌ పాజ్‌పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్‌ ఆమె వార్డ్‌ రోబ్‌ చూసి అవాక్కయ్యారట. 

ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్‌ సూట్‌ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్‌ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్‌ సూట్, అర పౌండ్‌కి కావల్సిన హీల్స్‌ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. 

విశేషమేమంటే ఆ రౌండ్‌లో ఆమెకు ‘బెస్ట్‌ స్విమ్‌సూట్‌’ సబ్‌ టైటిల్‌ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్‌ వేర్‌ ఈవెంట్‌లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్‌ ఈవెనింగ్‌ వేర్‌’ సబ్‌ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఫైనల్‌ ఈవెంట్‌లో కూడా జడ్జెస్‌ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని అందుకుంది. 

ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్‌ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్‌.  

గెలిచాక.. 
రీటా ఫారియాకు మోడలింగ్‌లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్‌ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్‌ వరల్డ్‌గా వేదికల మీద పర్సనల్‌ అపియరెన్స్‌ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్‌కి అడ్వర్టయిజ్‌ చేయలేదు. ఆమె కమిట్‌మెంట్‌కు ముచ్చటపడ్డ లండన్‌లోని ప్రిస్టేజియస్‌ కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. 

అక్కడే డాక్టర్‌ యురోపియన్‌ డేవిడ్‌ పావెల్‌ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్‌ ఆడుతారు. గార్డెనింగ్‌ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్‌ మ్యూజిక్‌ క్లాసెస్‌కూ వెళ్తారు.
– సరస్వతి రమ

(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement