వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరిస్తున్న సమయంలో భారత్‌ను దూరం చేసుకోలేమని చెప్పుకొచ్చారు. భారత్‌తో ఉన్న చారిత్రాత్మక, బలమైన, ముఖ్యమైన సంబంధాలను పణంగా పెట్టబోమని తెలిపారు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో మార్కో రుబియో ఈరోజు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాక్‌తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్‌కు ఆందోళనలు ఉన్నాయి. వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలనేది భారత్ అర్థం చేసుకోవాలి. ఎన్నడూ భారత్‌తో బంధాలను మేం వదులుకోబోమని క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో మాకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యం, దానితో ముడిపడిన అంశాల వరకు భారతీయులు ఎంతో పరిపక్వతతో ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాతో సంబంధాల్లేని కొన్ని దేశాలతో భారత్‌కు అనుబంధం ఉంది. అందువల్ల ఇదంతా పరిపక్వతతో కూడిన, ఆచరణీయ విదేశాంగ విధానం’ అని చెప్పుకొచ్చారు. అలాగే, రష్యాతో చమురు కొనుగోళ్ల సంబంధాలను మళ్లించుకునేందుకు భారత్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేసిందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. మలేషియా వేదికగా ఆసియన్ సదస్సు జరుగుతోంది. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు.


