సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.
ఇవాళ.. కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


