ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసిన సిట్
నేటి మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని వెల్లడి
మీరైనా రండి.. మేమైనా వస్తామన్న అధికారులు
బంజారాహిల్స్‌లో సీఎం రేవంత్
దిష్టిబోమ్మ దహనం..ఓయూలో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సాక్షిగా పరిగణిస్తూ సీఆరీ్పసీలోని సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలిసిన సమాచారం ఇవ్వాలని ఆయన్ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇప్పటివరకు కొందరు ప్రభుత్వ అత్యున్నత అధికారులు మినహా అందర్నీ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో సిట్ అధికారులు చట్ట ప్రకారం ఆయనకు ఓ వెసులుబాటు ఇచ్చారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. అలా కాకుంటే మీరు కోరిన చోటుకే తాము వస్తామంటూ పేర్కొన్నారు.
నందినగర్ నివాసానికి వెళ్లి..
నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తొలుత ఇందులో కేవలం ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉన్నారు. దీని దర్యాప్తు కోసం తొలుత అనధికారిక సిట్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడిస్తూ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారింది. సిట్ బృందం ప్రణీత్‌రావుతో పాటు మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేసింది.
మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత ఏడాది వరకు సిట్ అధికారులు కేవలం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, బాధితులతో పాటు ఇతరుల్నీ విచారించారు. కాగా గత నెలలో ఈ కేసు దర్యాప్తు కోసం డీజీపీ బి.శివధర్‌రెడ్డి అధికారిక సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్‌ను దీనికి చీఫ్‌గా నియమించారు.
ఆ తర్వాత దూకుడు పెంచిన సిట్ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకు నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ నెల 19న మాజీ మంత్రి హరీశ్‌రావు, 22న మరో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 27న మాజీ ఎంపీ సంతో‹Ùరావులకు నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయంలో విచారించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించడంతో పాటు వాంగ్మూలాలు నమోదు చేసింది.
ఎర్రవల్లి నివాసంలో కుదరదు..!
విచారణ జరిగే ప్రాంతానికి కేసు దర్యాప్తు అధికారితో పాటు మరికొందరు కూడా రావాల్సి ఉంటుందని కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ వివరించింది. ఎర్రవల్లి నివాసంలో విచారణ కుదరదని పరోక్షంగా స్పష్టం చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతాన్ని చెప్పాలని కోరింది. ఎక్కడకు వచ్చి విచారించాలనే సమాచారాన్ని కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి తెలపాలని సూచించింది.
బందోబస్తుపై పోలీసుల దృష్టి..
కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచి్చనా.. అధికారుల బృందం నందినగర్‌లోని ఇంటికి వెళ్లాల్సి వచి్చనా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆయా మార్గాలతో పాటు పరిసరాలనూ గమనించారు. ఎక్కడెక్కడ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి? ఎక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లింపులు విధించాలి? అనే అంశాలను పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజ రుకావాలంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలతో పా టు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మరోవైపు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు.


