బొగ్గుబాయిలో బకాయిల బూడిద | Singareni Coal Mines Company faces dues: Telangana | Sakshi
Sakshi News home page

బొగ్గుబాయిలో బకాయిల బూడిద

Jun 28 2025 5:38 AM | Updated on Jun 28 2025 5:38 AM

Singareni Coal Mines Company faces dues: Telangana

సింగరేణిని వెంటాడుతున్న బకాయిలు

పేరుకుపోయిన రూ.26 వేల కోట్లు

గత ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్లు 

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ.7వేల కోట్లు

గోదావరిఖని: దేశంలోని మహారత్న సంస్థలకు దీటుగా ముందుకు సాగుతున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థను బకాయిల బెంగ వెంటాడుతోంది. సంస్థ వరుస లాభాలార్జిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతోంది. సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కానీ వినియోగదారుల నుంచి రావల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు సుమారు రూ.26 వేల కోట్ల వరకు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు నగదు నిల్వలను తమ బ్యాంకుల్లో జమ చేయాలని బ్యాంకర్లు సింగరేణికి క్యూకట్టగా.. బకాయిల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తన అవసరాల కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల సంస్థ ప్రత్యక్షంగా సుమారు 42వేల మంది శాశ్వత ఉద్యోగులు, దాదాపు 25 వేల మంది ప్రైవేట్‌ కార్మికులు, పరోక్షంగా మరో లక్షమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు సౌర, థర్మల్‌ విద్యుదుత్పత్తిలోనూ అగ్రభాగాన నిలుస్తూ ఏటా లాభాలు సాధిస్తోంది. రాబోయే రోజుల్లో జలవిద్యుదుత్పత్తి చేసేందుకూ సన్నాహాలు చేస్తోంది.

క్రిటికల్‌ మినరల్‌ అన్వేషణ ద్వారా కొత్త వ్యాపారంలోకి అడుగిడాలని చూస్తోంది. ఈక్రమంలో సంస్థకు ఆర్థిక వనరులు ఇబ్బందిగా మారుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు రూ.19 వేల కోట్లు బకాయి పడగా, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు దాదాపు ఏడాదిన్నరలోనే సుమారు రూ.7వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా సింగరేణి సంస్థకు సుమారు రూ.26 వేల కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని తెలిపాయి.

విస్తరణకు నిధుల కొరత..
ప్రస్తుతం సింగరేణి సంస్థ విస్తరణ తప్పనిసరిగా మారింది. కొన్ని గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోతున్నాయి. మరికొన్ని గనులకు ఆధునిక సాంకేతికత అవసరం ఉంది. సంస్థకు రావలసిన బకాయిలు ఎప్పటికీ వసూలు కాకపోవడంతో సంస్థ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే విస్తరణకు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రమంలో త్వరగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. 

బకాయిల జాబితాలో విద్యుత్‌ సంస్థలు
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలకు అందజేస్తోంది. అలా సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు సరఫరా చేస్తోంది. ఈక్రమంలో సుమారు రూ.12వేల కోట్లు బొగ్గు బకాయిలే ఉన్నట్లు చెబుతున్నారు. రూ.14వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు రావలసి ఉంది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.వెయ్యి కోట్ల బకాయిలను చెల్లించినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది.

వెంటనే చెల్లించాలి
సింగరేణి సంస్థ భవిష్యత్‌ కోసం ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి. బకాయిల ప్రభావం సంస్థ అభివృద్ధిపై పడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ నేతలు చొరవ తీసుకోవాలి. 
– సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ

ఏడాదిన్నరలో రూ.7వేల కోట్లు
గత ప్రభుత్వం పదేళ్లలో రూ.19వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రూ.7వేల కోట్లు నిలిపివేసింది. ఈ విషయంలో ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించి సంస్థ భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి. దీనిద్వారా కొత్తగనుల ఏర్పాటు, సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుంది. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు,టీబీజీకేఎస్‌

రూ.వెయ్యి కోట్ల చెల్లింపు
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. మరికొన్ని త్వరలో రానున్నాయి. బకాయిలతో సంబంధం లేకుండా సంస్థ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. సంస్థ విస్తరణలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నాం. – ఎన్‌.బలరాం,సీఎండీ,సింగరేణి

Advertisement
 
Advertisement
Advertisement