సీఐడీ సిట్ విచారణ అనంతరం నటుడు రానా దగ్గుబాటి
బెట్టింగ్‌యాప్స్ కేసులో విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ
సాక్షి, హైదరాబాద్: చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే తాను బెట్టింగ్ యాప్‌నకు ప్రచారం చేశానని సినీ నటుడు రానా దగ్గుబాటి స్పష్టం చేశారు. తన లీగల్ టీం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రమోషన్ చేసినట్టు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో శనివారం సీఐడీ సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసులో సీఐడీ సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నటులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు.
ఇప్పటికే సినీ నటులు విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నించారు. ఇదే క్రమంలో శనివారం సిట్ ఎదుట సినీ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియ హాజరయ్యారు. సిట్ అధికారుల సూచన మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్లతో హీరో రానా విచారణకు హాజరయ్యారు. ‘బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారు?’అని ప్రశ్నించినట్టు తెలిసింది.
2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌ను రానా ప్రమోట్ చేశారు. అయితే, తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని సీఐడీ అధికారులకు రానా వివరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా విష్ణుప్రియ మొత్తం మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన సమన్ల మేరకు బ్యాంక్ అకౌంట్, స్టేట్‌మెంట్ వివరాలను విష్ణుప్రియ సిట్ అధికారులకు అందించారు.


