ఖండాంతరాలకు.. కడలుంగీలు | Raghunathapuram Lungis And Puttapaka Fabrics Win Hearts Worldwide | Sakshi
Sakshi News home page

ఖండాంతరాలకు.. కడలుంగీలు

Nov 10 2025 8:55 AM | Updated on Nov 10 2025 8:55 AM

Raghunathapuram Lungis And Puttapaka Fabrics Win Hearts Worldwide

ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన  వస్త్రాలు

అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు 

అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు

పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్‌

 ఫ్రాన్స్‌ ప్రథమ పౌరురాలిని ఆకట్టుకున్న దుబీయన్‌

ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం,  ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు,  పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్‌ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు

యాదాద్రి భువనగిరి జిల్లా :  రాజాపేట మండలంలోని రఘునాథపురం అనగానే మదిలో మెదిలేది పవర్‌లూమ్‌(మరమగ్గం) పరిశ్రమ. వీటిపై తయారైన కడలుంగీలు జిల్లా పేరును దేశ, విదేశాలకు తీసుకెళ్లాయి. ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఇక్కడి కార్మికులకే దక్కుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా కడలుంగీలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామంలో 800 వరకు పవర్‌లూమ్స్‌ ఉండగా అందులో 400 మరమగ్గాలపై కడలుంగీలు తయారు చేస్తున్నారు. ఒక మరమగ్గంపై పది చొప్పున రోజుకు 3వేల వరకు కడలుంగీలు ఉత్పత్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు.  

పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్‌ వస్త్రం    
సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్‌ ఆఫ్రికా, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్‌కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్‌ సిల్క్‌ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్‌ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్‌ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.

తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి   
రఘునాథపురంలో పవర్‌లూమ్‌ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్‌లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్‌గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్‌ బైపిక్‌ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్‌ వీవర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్‌ తదితర అరబ్‌ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్‌ మెటీరియల్‌గా వినియోగిస్తుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement