వైద్య కళాశాలల్లో ఏ వసతులు కల్పించాలి? | Prepare Action Plan On Facilities Required In Medical Colleges: Revanth Reddy | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలల్లో ఏ వసతులు కల్పించాలి?

Jun 17 2025 1:15 AM | Updated on Jun 17 2025 1:15 AM

Prepare Action Plan On Facilities Required In Medical Colleges: Revanth Reddy

అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి  

క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ 

వైద్యారోగ్యశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని జాతీయ వైద్యమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2025–26 సంవత్సరానికి ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు రెన్యూవల్‌ చేయాలంటే.. ఈనెల 18న వైద్యశాఖ కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలోనే కళాశాలల్లోని వసతులు, జాతీయ వైద్యమండలి పేర్కొంటున్న నియమ, నిబంధనలు వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే వైద్యారోగ్యశాఖపై ఐసీసీసీలో సోమవారం సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమరి్పంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంతమేర నిధులు కావాలనే దానిపై నివేదిక ఇవ్వాలన్నారు. జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి పదోన్నతులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు.  

నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ సబ్టెక్ట్‌ ఉండాలి  
నర్సింగ్‌ కళాశాలల్లో జపనీస్‌ (జపాన్‌ భాష)ను ఒక ఆప్ష నల్‌గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతినెలా మూడోవారంలో ఈ రెండు శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్‌ డాక్టర్‌ నరేందర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement