గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు గుప్పించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆధారాలతో పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మంత్రులు వస్తారా? పారిపోతారా? తేలేది రేపే అని వ్యాఖ్యానించారు.
‘‘జీవో నం 17 చట్ట విరుద్దమంటూ హై కోర్టు మార్పులు చేయాలని సూచించినా, ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? కాంట్రాక్టుల్లో సెంట్రలైజ్డ్ పద్ధతిని ఎందుకు తెచ్చారు? స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ సంపద దోచి పెడుతున్నారు.
మఫత్ లాల్ ఎవరు? ఆయనకు యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ కాంట్రాక్ట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులను మోసం చేసింది నిజం కాదా? నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? టోనీ అనే డ్రగ్ సప్లయర్, నిరంజన్ కుమార్ జైన్ కు ఏంటి సంబంధం? డ్రగ్స్ సప్లయ్ చేసే కంపెనీకి, ట్రంకు బాక్సుల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?
రాజేశ్ అగర్వాల్ ఎవరు? షూ సప్లయ్ టెండర్ కాంట్రాక్ట్ అతనికి ఎలా ఇచ్చారు? తెలంగాణలో తోలు వ్యాపారం చేసే మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? రూ.2,041 కోట్ల టెండర్లు ఖరారైనా ఇప్పటికీ విద్యార్థులకు ఎందుకు వస్తువులు అందడం లేదు? పిల్లలకు సప్లయ్ చేసే నోట్ బుక్ పేపర్ పై వాటర్ మార్క్ నిబంధన ఎలా వచ్చింది? కరెన్సీ పేపర్, రెవెన్యూ స్టాంప్ పేపర్లకు వాడే వాటర్ మార్క్... పిల్లల నోట్ బుక్స్ కి ఎందుకు?
ఈ నిబంధన ఎవరి కోసం చేర్చారు? ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ ఎందుకు? మా ఆరోపణల్లో అవాస్తవాలు ఉంటే గురువారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి,ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ అందరూ ఆధారాలతో వచ్చి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. కాంగ్రెస్ వస్తుందా? అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా తప్పిస్తుందా? చూద్దాం’’ అని చెప్పారు.


