
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: పండుగకి ఊరెళ్తున్నారా?.. ఎందుకైనా మంచిదని లిక్విడ్ క్యాష్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్త మీ కోసమే..!. పరిమితికి మించి డబ్బును తీసుకెళ్ళకండి. ఒకవేళ తీసుకెళ్లినా.. ఆ డబ్బును ఎందుకు తీసుకెళ్తున్నారో అనేదానికి సంబంధించిన డాక్యుమెంట్లను మోసుకెళ్లండి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ లిమిట్ ఎంతో తెలుసా?..
తెలంగాణ ‘స్థానికం’ కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో.. తక్షణ ఎన్నిక కోడ్(Election Code in Telangana) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నాం నుంచే.. పోలీసులు, ఆబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లాల వ్యాప్తంగా రోడ్లపై వాహనాలను సోదా చేయడం ప్రారంభించారు. మంగళవారం నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ డబ్బును పోలీసులు సీజ్(Telangana Police Money Seize) చేస్తారు. ఆపై ఆ డబ్బును రెవెన్యూ అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ నగదు మరీ ఎక్కువగా ఉంటే ఉంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీకి సమాచారం అందించి ఆపై కోర్టులో జమ చేస్తారు. అయితే ఇదంతా సరైన పత్రాలు లేకపోతేనే జరుగుతుంది.
మెడికల్ ఎమర్జెన్సీ, కాలేజీ ఫీజులు, పెళ్లి, వ్యాపారాల నిమిత్త అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలి. ఒకవేళ తనిఖీల సమయంలో చూపలేకపోయినా.. ఆ తర్వాత అయినా ఈ పేపర్లను సమర్పించి జప్తు అయిన డబ్బును తిరిగి పొందొచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో లిక్కర్ మోసుకెళ్లేవాళ్లు కూడా ఈ విషయం గమనించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇలా..