
షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్
తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు
రెండు దశల్లో అక్టోబర్ 23, 27 తేదీల్లో నిర్వహణ
నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్
మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు
అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో ‘పల్లె పోరు’
ఏ రోజుకు ఆ రోజే వెలువడనున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు
అక్టోబర్ 9న మొదలై నవంబర్ 11న ముగియనున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో దశ ఎన్నికలు అదే నెల 8న జరగనున్నాయి.
మొత్తం మీద అక్టోబర్ 9న మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ, నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ (రెండు దఫాలకు) నవంబర్ 11న నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమే చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.
మొత్తం ఐదు దశలు..
స్థానిక ఎన్నికల ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని చెప్పారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో డీజీపీ జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్,పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పీఆర్‌ఆర్ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందలతో కలిసి ఆమె స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఖాళీల వివరాలతో కూడిన గెజిట్‌ను అధికారులు విడుదల చేశారని తెలిపారు.
ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెప్పారు. ఇవి జారీ అయిన రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. హైకోరు ్టస్టే ఉత్తర్వులకారణంగా..14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలు, వీటిలోని 16 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని కమిషనర్ తెలియజేశారు.