కోవిడ్‌ అనాథలకు ‘పీఎం కేర్స్‌’: కిషన్‌రెడ్డి

PM Course For Orphans Suffer From Covid: Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలు, విద్యార్థులను ‘పీఎం కేర్స్‌’ద్వారా దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’పథకాన్ని సోమవారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. 2020 ఏప్రిల్‌ 28 నుంచి ఈ ఏడాది ఫిబ్ర వరి వరకు తల్లిదండ్రులు, సంరక్షకులు, దత్తత తీసుకున్నవారు చనిపోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు కేంద్రం, ప్రధాని మోదీనే గార్డియన్‌గా వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమవుతుందని, హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్టు తెలిపా రు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 9,042 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని తిరిగి జిల్లా కలెక్టర్లు పరిశీలించి 4,345 మంది పిల్ల లను అర్హులుగా గుర్తించి సిఫార్సు జాబితా పంపించారని తెలిపారు. ఈ పిల్లల పేరిట రూ.10 లక్షలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామని, 18 ఏళ్లు నిండిన వారికి సోమవారం వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. 

నెలనెలా స్టైపెండ్‌..: కోవిడ్‌ అనాథలకు నెలనెలా స్టైపెండ్‌ కూడా ఇస్తామని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చే వరకు ఈ స్టైపెండ్‌ కొనసాగుతుందని, 23 ఏళ్లు నిండాక రూ.10 లక్షల నగదును కేంద్రప్రభుత్వం అందజేస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ తీసుకునేవారికి రూ.50 వేల చొప్పున, స్కిల్‌ ట్రైనింగ్‌ పొందేవారికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు ఇస్తారని పేర్కొన్నారు.

ఇలాంటి పిల్లలు, విద్యార్థులకు అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించేలా యూజీసీ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. విదేశీవిద్య చదవాలనుకునే ఈ పిల్లలకు వడ్డీలేని బ్యాంక్‌ రుణాలు అందజేస్తామన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నట్టు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top