సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని సిట్ పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళే రెండో నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్‌కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చింది. వయసురిత్యా(65 ఏళ్లు పైబడడంతో) పీఎస్‌కే రావాల్సిన అవసరం లేదని.. నగర పరిధిలోనే ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నోటీసులను నందినగర్‌లోని నివాసానికి వెళ్లి కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులు అందజేశారు.
అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడి నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్‌కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. కానీ ఫాంహౌజ్‌లోనే తనను విచారణ జరపాలని సిట్‌ను ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తోంది. వీలైతే ఇవాళ సెకండ్ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ జరపొచ్చని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.


