సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు(శుక్రవారం, జనవరి 30న) కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నాం 3గం. విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్నవాళ్లు.. దర్యాప్తు కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. వయసురిత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది.

విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పీఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి దశలో బీఆర్‌ఎస్ హయాంలో పని చేసిన పోలీస్ అధికారులను, కేసీఆర్ పేషీలో పని చేసిన ఉన్నతాధికారులను సిట్ ప్రశ్నించింది. వీళ్లిచ్చిన స్టేట్‌మెంట్లతో రెండో దఫా విచారణలో.. వరుసగా రాజకీయ నేతలను సిట్ విచారణ జరుపుతోంది. బీఆర్‌ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.
అయితే ఇదొక లొట్ట పీసు కేసు అని, పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా బీఆర్‌ఎస్ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నోటీసుల అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


