ఊరెళ్లిపోతోంది..! | Palamuru Drought Farmers Migration Crop Losses | Sakshi
Sakshi News home page

ఊరెళ్లిపోతోంది..!

Oct 9 2026 5:56 AM | Updated on Oct 9 2026 5:56 AM

Palamuru Drought Farmers Migration Crop Losses

గంగిమాన్‌దొడ్డిలో ఓ కుటుంబం వలస Ðð ళ్లడంతో ఇంటికి తాళం పడిన దృశ్యం

పాలమూరుపై కరువు పంజా.. మళ్లీ మొదలైన వలసలు ∙మేత కొరతతో పశువుల్ని సంతల్లో అమ్మేసుకుంటున్న రైతులు

వర్షాభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ విలవిల

42 శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో గద్వాల జిల్లా

నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తిలోనూ తీవ్రమైన వర్షాభావం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 40 శాతం మేర ఎండిన పంటలు

మరో 20 శాతం ఎండిపోయే దశలో.. రబీ సాగుపైనా సన్నగిల్లిన ఆశలు

పాలమూరు నేలను ఒరుసుకుంటూ తుంగభద్ర ప్రవహించినా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కినా, భీమా నది సాగినా కవి శ్రీశ్రీ అన్నట్లు అవి శిశువుకు అందని స్థన్యంగా మారడంతో ఈ ప్రాంతాన్ని చీకటి రోజులు చుట్టుముడుతున్నాయి. ఎల్‌ నినో వాతావరణం, తీవ్ర వర్షాభావంతో రిజర్వాయర్లు, కుంటలు, బావులు బావురుమంటున్నాయి.

సాగు భూములు బీళ్లుగా మారి నోళ్లు తెరుస్తున్నాయి. మేత, నీటి కొరత నేపథ్యంలో పశువులు, మూగ జీవాలు సంతలు, కబేళాలకు తరలుతుంటే.. ఉన్న ఊరిని, కడుపున పుట్టిన బిడ్డల్ని, వృద్ధులైన అమ్మానాయనల్ని వదిలేసి ఉపాధి కోసం జంటలు వలస బాట పడుతున్న దృశ్యాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కన్పిస్తున్నాయి.
- కిశోర్‌కుమార్‌ పెరుమాండ్ల

ఈ ఏడాది వానాకాలంలో 42 శాతం లోటు వర్షపాతంతో గద్వాల జిల్లా రాష్ట్రంలో చిట్టచివరి స్థానం (33వ)లో నిలిచింది. 36 శాతం లోటుతో నారాయణపేట జిల్లా చివరి నుంచి రెండో స్థానం (32)లో ఉంది. 32.75 శాతం లోటుతో నాగర్‌కర్నూల్, 32.20 శాతం లోటుతో వనపర్తి, 29.61 శాతం లోటుతో మహబూబ్‌నగర్‌ జిల్లాలు కింది నుంచి గద్వాల, నారాయణ పేట తర్వాత స్థానాల్లో ఉన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఏకంగా 20 నుంచి 30 రోజులు పాటు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు.

ఈ నేపథ్యంలో రిజర్వాయర్లు దాదాపుగా బోసిపోయాయి. ఉమ్మడి పాలమూరుకు ప్రధాన జలవనరు జూరాల ఆయకట్టు కింద లక్ష ఎకరాలకుపైగా వరి సాగైంది. ప్రస్తుతం వారబందీ పద్ధతిలో ఆరు రోజుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 8.08 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అయితే డెడ్‌స్టోరేజీ, సిల్ట్‌ పోనూ అందుబాటులో ఉన్నవి 4.38 టీఎంసీలే.

ఈ కారణంగానే వారబందీ అమలు చేస్తున్నారు. జూరాలతోపాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కేఎల్‌ఐ, భీమా ఎత్తిపోతల పథకం కింద సుమారు ఆరు లక్షల ఎకరాల వరకు సాగు కాగా.. ఎక్కడా సరిపోను నీళ్లు లేవు. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.

పాతాళానికి భూగర్భ జలాలు చెరువులు, కుంటల్లో నీరు చేరక భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో పాతాళానికి పడిపోయాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 5.24 మీటర్లు, నారాయణపేటలో 4.23, నాగర్‌కర్నూల్‌లో 4.19, వనపర్తిలో 3.15, గద్వాల జిల్లాలో అత్యల్పంగా 2.70 మీటర్ల క్షీణత నమోదైంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాధారణ సాగు అంచనా 21.32 లక్షల ఎకరాలైతే వర్షాల్లేక 16.61 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.

ఒక్క వరి సాగులోనే 35 శాతం కోత పడింది. సాగైన దాంట్లోనూ నీరు లేక 2.50 లక్షల నుంచి 3 లక్షల ఎకరాల్లో (దాదాపు 40 శాతం) పంటలు ఎండిపోయాయి.  మరో 20 శాతం ఎండిపోయే దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ నట్టేట ముంచితే రబీపైనా ఆశలు సన్నగిల్లుతున్నాయి. పంటల సాగు కోసం చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోవడంతో పలు ప్రాంతాల్లో రైతులు కుటుంబాలను పోషించుకునేందుకు హైదరాబాద్, పుణె, సూరత్, ముంబై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు.

వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు పొట్ట చేతపట్టుకుని వలస బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నారాయణపేట, మాగనూరు, ఆత్మకూరు, కేటీదొడ్డి, గట్టు, ధరూర్‌ తదితర ప్రాంతాల నుంచి కుటుంబాలు తరలిపోతున్నట్లు సమాచారం. కాగా మరోవైపు పశుగ్రాసం కొరతతో రైతులు పశువులను అమ్మేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: జూరాల రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement