సాగునీరు ఇవ్వమన్నందుకు పలు సెక్షన్లు విధింపు
వివిధ గ్రామాలకు చెందిన 14 మందిపై నమోదు
రైతులపై కేసులు ఎత్తివేయాలి: ఎంపీ డీకే అరుణ
తెలంగాణ: జూరాల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి..తమ పంటలను కాపాడాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అధికారులు సాగునీటిని నిలిపివేశారు. దీంతో రైతులు పంటలకు సాగునీరు వదలాలని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద గత నెల 18, 19 తేదీల్లో ఆందోళన చేశారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం పార్టీలు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న రైతులు గత నెల 19న సాయంత్రం 6 గంటల సమయంలో ప్రాజెక్టు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేసినా సాగునీరు వదలమని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీపైకి ఎక్కి కాల్వ గేట్లను ఎత్తే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతులను అడ్డుకుని ప్రాజెక్టు సిబ్బందితో కాల్వ గేట్లను మూసి వేయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రైతులు, రైతులకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయాలని పీజేపీ అధికారులను ఆదేశించింది.
దీంతో నందిమళ్ల డివిజన్ డీఈ షమీఉల్లా అమరచింత పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 14 మంది రైతులు కృష్ణారెడ్డి, రాజు మోట్లంపల్లి, కురుమూర్తి, జీఎస్ గోపి, ఎండీ జబ్బార్, ఏటి భాస్కర్, లక్ష్మణ్, షరీఫ్, దేవేందర్, నరేష్, నర్సింహ, సద్దల భాను, శేఖర్‌రెడ్డి, వేణులపై కేసులు నమోదు చేసినట్లు అమరచింత ఎస్‌ఐ స్వాతి తెలిపారు. బీఎన్‌ఎస్ 132, 305(2), 352, 221, 126(2), 329(3), 189(2), 191(2), 324(4), 190 బీఎన్‌ఎస్ అండ్ సెక్షన్ 3 పీడీపీపీ ఏసీటీ సెక్షన్లు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వాతి వెల్లడించారు.
మరోవైపు జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేసిన రైతులు, వారికి మద్దతు తెలిపిన నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని, ఇలాంటి బెదిరింపులకు రైతులు భయపడరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు నీళ్లు తీసుకు వస్తామని పెద్ద డ్రామాలు చేశారని విమర్శించారు. తుపాను వల్ల కురిసిన వర్షాలకు నీరు వస్తే.. కర్ణాటక విడుదల చేసిన నీళ్లని నమ్మించారని, కానీ చుక్క నీరు ఆ రాష్ట్రం నుంచి రాలేదన్నారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అందరిపై కేసులు ఎత్తివేసి, వెంటనే జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘చారిత్రక నవలా చక్రవర్తి’ ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత


