గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఆచార్యులు
నలభై ఏళ్లకు పైగా తెలుగు సాహిత్య రంగానికి మార్గదర్శి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహిత్య లోకంలో ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా పేరుగాంచిన ప్రముఖ రచయిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ (86) హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, శివం రోడ్డులోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఉన్న నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుమారుడు ముదిగొండ ఇందుశేఖర్ తెలిపారు. శివప్రసాద్ మృతి పట్ల సాహిత్య, సాంస్కతిక రంగాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
విశిష్ట విద్యాభ్యాసం.. బహుభాషా కోవిదుడు
ప్రకాశం జిల్లా అల్లూరులో 1940 డిసెంబర్ 23న శివప్రసాద్ జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, మల్లికార్జునరావు. 1962లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది, 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం తెలుగు ఆచార్యుడిగా సేవలందించి నలభై ఏళ్లకు పైగా సాహిత్య రంగానికి మార్గదర్శకునిగా నిలిచారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీ‹Ù, సంస్కృతం, గ్రీక్ భాషలలో ఆయనకు ప్రవేశం ఉంది. ‘భారతీయ – గ్రీక్ సంస్కతుల తులనాత్మక పరిశీలన’ అంశంపై ఆయన చేసిన విశేష పరిశోధనలు సాహిత్య లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
రచనా వైవిధ్యం .. పరిశోధక మార్గదర్శి
శివప్రసాద్ రచించిన ‘శ్రీలేఖ’, ‘శ్రీ పదార్చన’, ‘తంజావూరు విజయం’ వంటి నవలలు, పాఠ్య గ్రంథాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సాహిత్యానికి ఆయన చేసిన అమూల్య సేవలకు గాను ‘చారిత్రక నవలా చక్రవర్తి’, ‘శివ కవీంద్ర’, ‘అభినవ పాల్కురికి’, ‘అభినవ ధూర్జటి’, ‘చారిత్రక నవలా సామ్రాట్’ వంటి బిరుదులు లభించాయి. ఆయన పర్యవేక్షణలో 30 మందికి పైగా ఎం.ఫిల్., పిహెచ్.డీ విద్యార్థులు పరిశోధనలు పూర్తి చేశారు. శివప్రసాద్ జీవితం, రచనలపై ఎస్.కె. ఉస్మానియా, నాగార్జున విశ్వవిద్యాలయాల నుంచి పలువురు పరిశోధకులు పిహెచ్.డీ పట్టాలు పొందడం విశేషం. ఆయన 2004, 2011లలో ’స్వర్ణ కంకణం’, 2006లో కుర్తాళం పీఠాధిపతిచే ’కనకాభిõÙకం’, ’స్వర్ణ గండపెండేరం’ సత్కారాలతో పాటు 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ’విశాఖ ఉగాది పురస్కారం’ అందుకున్నారు.
సాహిత్య రంగానికి తీరని లోటు
ముదిగొండ శివప్రసాద్ మరణం తెలుగు సాహిత్య రంగానికి, ప్రత్యేకించి చారిత్రక నవలా ప్రక్రియకు తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇప్పటివరకు 2.35 కోట్ల మంది పాస్!


