ఇప్పటివరకు 2.35 కోట్ల మంది పాస్‌! | SIR: Final Electoral Roll Likely to Include Over 2. 65 Crore Voters | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు 2.35 కోట్ల మంది పాస్‌!

Oct 9 2026 5:01 AM | Updated on Oct 9 2026 5:01 AM

SIR: Final Electoral Roll Likely to Include Over 2. 65 Crore Voters

‘సర్‌’తుది ఓటర్ల జాబితాలో ప్రచురణకు అర్హులుగా నిర్ధారణ 

విచారణ దశలో మిగిలిన 29,07,330 మంది ఓటర్ల అర్హతలు  

92,88,186 మంది ‘నోటీసు’ ఓటర్లలో 80,20,128 మంది విచారణ పూర్తి 

తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2.65 కోట్లకు పైగా ఓటర్లు ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌), 2026 చేపట్టడానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, గత ఆగస్టు 17న ప్రకటించిన ‘సర్‌’ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,213కు తగ్గిపోయింది. అప్పట్లో 73,39,235 మంది ఓటర్లను గైర్హాజరీలో ఉన్న/వలసపోయిన/మరణించిన/డూప్లికేట్‌ ఓటర్లు అనే కారణంతో తొలగించారు. ఇక ఆ ముసాయిదా జాబితాలోని ఓటర్లలో గురువారం నాటికి మొత్తం 2,35,67,748 మంది ఓటర్లను నవంబర్‌ 9న ప్రచురించనున్న ‘సర్‌’తుది ఓటర్ల జాబితాలో పేరు సంపాదించడానికి అర్హులుగా తేల్చారు. 

ఇప్పటివరకు 12,135 మంది ఓటర్లను అనర్హులుగా నిర్ధారించారు. ముసాయిదా జాబితాలోని మిగిలిన 29,07,330 మంది ఓటర్ల అర్హతను ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రక్రియ సరళిని పరిశీలిస్తే వీరిలో చాలా మంది అర్హులయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. 29 లక్షల మందిలో 25 లక్షల మంది అర్హులుగా తేలినా మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 2.6 కోట్లకు చేరుతుంది. ఈ నెల 7తో ముగిసిన ‘సర్‌’దరఖాస్తులు, అభ్యంతరాల గడువులోగా కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 4,88,417 మంది ఫారం–6లో దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే వీరిలో 51,821 మందిని అర్హులుగా నిర్ధారించారు. 

ఇంకా 6,270 మంది ప్రవాస తెలంగాణీయులు కొత్త ఓటర్లుగా నమోదు కావడానికి ఫారం–6ఏ దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 118 మందిని అర్హులుగా గుర్తించారు. కొత్తగా నమోదు కానున్న ఓటర్లను సైతం పరిగణనలోకి తీసుకుంటే నవంబర్‌ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.65 కోట్లకు పైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సర్, 2026 ప్రారంభం కావడానికి ముందు 3.38 కోట్ల మందితో ఉన్న ఓటర్ల జాబితాతో పోల్చితే ‘సర్‌’తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక రాష్ట్రంలో దాదాపుగా 70 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. 

ముసాయిదా జాబితాలోని 24,323 మంది ఓటర్లను తొలగించడానికి ఫారం–7 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 12,204 ఓటర్లను అనర్హులుగా తేల్చి తొలగించారు. ఇక ఓటర్ల సమాచారంలో పొరపాట్ల దిద్దుబాటు/మరో ప్రాంతానికి ఓటు బదిలీ కోసం మొత్తం 5,05,159 మంది ఓటర్లు ఫారం–8లో దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 2,27,721 మంది ఓటర్ల వివరాల్లో ఆ మేరకు మార్పులు చేశారు.

92 లక్షల ‘నోటీసు’ల ఓటర్లలో 72 లక్షల మంది అర్హులే..
‘సర్‌’ముసాయిదా జాబితాలోని 2,64,87,213 మంది ఓటర్లలో.. 92,88,186 మంది ఓటర్ల అర్హతలపై అనుమానాలతో నోటీసులు జారీ చేసి విచారించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 2002 ఓటర్ల జాబితాలో మ్యాపింగ్‌ జరగని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలున్న ఓటర్లు వీరిలో ఉన్నారు. గురువారం నాటికి 92,06,763 మంది ఓటర్లకు నోటీసులు జారీచేయగా, మరో 81,423 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 80,20,128 మంది ఓటర్ల విచారణ పూర్తైంది.

విచారణ తర్వాత ఇప్పటివరకు 69,69,639 మంది ఓటర్లు తుది జాబితాలో ప్రచురించడానికి అర్హులుగా నిర్ధారించగా, విచారణ అవసరం లేకుండా మరో 2,78,234 మంది ఓటర్లను అర్హులుగా గుర్తించారు. ఈ రెండు కేటగిరీలు కలిపి నోటీసులు అందుకోవాల్సిన 92,88,186 మంది ఓటర్లలో ఇప్పటికే 72,47,873 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు.

విచారణ తర్వాత ఇప్పటి వరకు 12,135 మంది ఓటర్లను అనర్హులుగా తేల్చారు. తుది ఓటర్ల జాబితా ప్రచురించడానికి ముందు వీరి అర్హతలను మళ్లీ పరీక్షించి ఎలాంటి పొరపాట్లు జరగలేదని నిర్ధారించుకున్న తర్వాతే వీరి పేర్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటారు. నోటీసు అందుకున్న/అందుకోవాల్సిన 20,28,178 మంది ఓటర్ల అర్హతపై ఇంకా నిర్ణయం జరగాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement